కళాకారులకు చప్పట్టు ప్రోత్సాహమిస్తే… పురస్కారాలు ఆక్సిజన్ లాంటివి అంటారు. అందుకే నటులను గౌరవించుకోవడం, సినిమాను సత్కరించుకోవడం చాలా అవసరం అని చెబుతుంటారు. అయితే గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితే కనిపించడం లేదు. సినిమాను, సినిమావాళ్లను గౌరవించుకునే, నాలుగు మంచి మాటలు చెప్పే పరిస్థితే లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఇప్పటికే చాలామంది చెప్పారు. తాజాగా వెటరన్ నటుడు మురళీ మోహన్ కూడా అన్నారు. ఉగాది సందర్భంగా నగరంలో ఉగాది సినిమా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగానే మురళీ మోహన్ తెలుగు సినిమా పట్ల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలి గురించి మాట్లాడారు. దీంతో ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 24 విభాగాలకు చెందిన సినీ ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సినీనటులు బ్రహ్మానందం, మురళీమోహన్.. నిర్మాత సి.కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. మురళీ మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సినీ నటులకు అవార్డులు ఆక్సిజన్ లాంటివి అన్నారు. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా పక్కన పెట్టాయి అని విమర్శించారు.
ఏడేళ్ల నుండి నంది అవార్డులు ఇవ్వడం లేదు అని గుర్తు చేశారాయన. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సినిమా వాళ్ల మీద ఎప్పుడు దయ కలుగుతుందో అవార్డులు ఇవ్వడానికి అని వ్యాఖ్యానించారు. చాలా ప్రైవేటు సంస్థలు నటీనటులకు అవార్డులు ఇస్తున్నాయని గుర్తు చేశారు కూడా. మురళీ మోహన్ చెప్పింది కూడా నిజమే. తెలుగు చలన చిత్ర సీమను గౌరవించుకునే క్రమంలో ఏటా నంది పురస్కారాలు అందిస్తూ వచ్చేవారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఈ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి.
ఆ మధ్య అవార్డుల సంగతి బయటికొచ్చేలా కనిపించినా తర్వాత ఆ ముచ్చట లేదు. తెలంగాణలో నంది అవార్డుల స్థానంలో కొత్త అవార్డులు తీసుకొస్తారని కూడా అన్నారు. ఆ తర్వాత దీని ఊసు కూడా లేదు. అయితే సినిమా టికెట్ రేట్ల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మధ్య ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. త్వరలో అవార్డుల సంగతి కూడా తేలుస్తారేమో చూడాలి. అన్నట్లు ఈ వ్యవహారంపై ఇప్పటికే చిరంజీవి వివిధ వేదికల మీద మాట్లాడిన విషయం తెలిసిందే. అప్పుడు చలించని ప్రభుత్వాలు, ఇప్పుడు మాట్లాడతాయా?
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?