ప్రముఖ సంగీత దర్శకుడు, తొలి తరం టీవీ సీరియళ్లకు సంగీత దర్శకత్వం అందించిన నల్లూరి సుధీర్ కుమార్ (71) కన్నుమూశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగహృంలో గుండెపోటుతో మృతి చెందారు. దూరదర్శన్‌లో టీవీ సీరియళ్లకు సంగీతం అందించి అవార్డులు, రివార్డులు సంపాదించుకున్నారు. లలిత సంగీత గాయకుడిగానూ నల్లూరి సుధీర్‌కుమార్ ప్రసిద్ధి. తెలుగులో వివిధ టీవీ సీరియళ్లు, రేడియో కార్యక్రమాలకు సంగీత దర్శకుడిగా సుధీర్‌కుమార్ సేవలందించారు. సంగీతంతోపాటు నటనలోనూ ఆయన ప్రవేశం ఉంది.
సుధీర్ కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమార్తెలు రమ్యశ్రుతి, శ్రావ్య శ్రుతి ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె రమ్య శ్రుతి గాయకురాలిగా ప్రస్తుతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1980 నుండి 2000 సంవత్సరం వరకు టీవీ రంగంలో సంగీత దర్శకుడిగా సుధీర్ కుమార్ పేరుగాంచారు. ‘కిట్టిగాడు’, ‘అనగనగా ఒక శోభ’ లాంటి సీరియళ్లతో పాటు దేశభక్తి పాటలు కూడా ఆయన స్వరపరిచారు.
అప్పట్లో టీవీల్లో ప్రసారమైన వాణిజ్య ప్రకటనలు, రాజకీయ పార్టీల పాటలకు సంగీత దర్శకుడిగా కూడా చేశారు. అలాగే సినిమాల్లోనూ సుధీర్ కుమార్ రాణించారు. ‘అగ్ని ప్రవేశం’ సినిమాతో తొలిసారి సంగీత దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ‘అమ్మో అల్లుడా’, ‘కూతురు’, ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’ లాంటి సినిమాలకు సంగీతం అందించారు. కొన్ని కన్నడ సినిమాల్లోనూ ఆయన నటించారు. ఇక టీవీ సంగీత దర్శకుడిగా ఆరు నంది అవార్డులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించి సత్కరించింది.