కాలేజీ డేస్ అనగానే ఎవరికైనా చదువుకంటే ముందు అల్లరి గుర్తుకు వస్తుంది. ఆ వయసులో కామ్ గా కూర్చోలేము. ఏదో పెంకి పని చేసి తిట్లు తినాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీతీ సింగ్ కూడా టీనేజ్లో భలే అల్లరి చేసినట్లు చెప్పింది. ఈ ముద్దుగుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి ధ్రువ సినిమాలో నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఆడి పాడేందుకు సిద్ధమైంది.
ఈమెని .. ఎప్పుడైనా అల్లరి చేశారా? అని ప్రశ్నించగా.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయింది. అలనాటి సంగతులను గుర్తుచేసుకుంది. “కాలేజీ చదివే రోజుల్లో నేను చేసిన అల్లరి గుర్తు చేసుకుంటే నవ్వు వస్తోంది. నాతో పాటు నలుగురు మిత్రులుండే వారు. మేమంతా లెక్చరర్స్ ని భలే బురిడీ కొట్టించేవాళ్లం. ఎవరికి క్లాస్ బోర్ కొట్టినా, అందరూ కలసి కట్టుగా ఓ మాటమీద నిలబడి కాలేజీ నుంచి పారిపోయేవాళ్లం. ఒక్కోసారి మాలో ఓ అమ్మాయి స్పృహ తప్పినట్టు నటించి పడిపోయేది.
తనని ఇంటికి తీసుకెళ్లాలి అనే నెపంతో మేం ఐదుగురం కాలేజీ నుంచి బయటకు వచ్చేసేవాళ్లం. ఎంత అల్లరి చేసినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. పైగా మా అల్లరి ముద్దుగానే ఉండేది’’ అని రకుల్ చెప్పుకొచ్చింది. కాలేజీ బంక్ కొట్టడానికి మేము ఆడిన నాటకాలు వల్ల నాకు నటన అబ్బి ఉంటుందని ఈ ఫిట్ నెస్ బ్యూటీ నవ్వుతూ చెప్పింది.