ప్రతివారం పదేసి సినిమాలు చొప్పున థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో బజ్ ఉన్న సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ శుక్రవారం నాడు కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘మంగళవారం’ వంటి సినిమాకి మంచి క్రేజ్ ఉంది. అలాగే స్టార్ హీరోయిన్ హన్సిక నటించిన ‘మై నేమ్ ఈజ్ శృతి’ కూడా వార్తల్లో నిలిచింది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ జనాలకి కలిగింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: శృతి(హన్సిక) తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతారు ఆమె తల్లి, తాతయ్య, నానమ్మ..లు! శృతి పెద్దయ్యాక ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆమెను తన అక్క, బావ(ప్రవీణ్) ఇంట్లో పెడతారు కుటుంబ సభ్యులు. కానీ కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి..వారి ప్రైవసికి ఇబ్బందవుతుందని శృతి ఓ హాస్టల్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కూడా ఇబ్బంది ఉందని తన ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతుంది.
అయితే ఓ రోజు శృతి తన ఫ్లాట్ లో ఊహించని విధంగా ఓ మర్డర్ చేయాల్సి వస్తుంది. ఆ క్రైమ్ నుండి తప్పించుకోవాలి అని శృతి ప్రయత్నిస్తూ ఉండగా.. ఆమె చంపిన వ్యక్తి కాకుండా వేరే అమ్మాయి తన ఫ్లాట్ లో చచ్చిపడి ఉండటంతో షాక్ అవుతుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. మరోపక్క స్కిన్ మాఫియాలో భాగంగా కొంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు.
దీని వెనుక ఎం.ఎల్.ఎ గురుమూర్తి(ఆడుకలం నరైన్) హస్తం ఉందని తేలుతుంది. అసలు ఈ ఎం.ఎల్.ఎ కి శృతి కి సంబంధం ఏంటి? మధ్యలో ఏసీపీ రంజిత్(మురళీ శర్మ) పాత్ర ఏంటి? శృతిని చంపాలని చూస్తుంది ఎవరు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: హన్సిక ..టైటిల్ రోల్లో కనిపించింది. తన మార్క్ నటనతో పర్వాలేదు అనిపించింది కానీ.. ఎందుకో ఆమె లుక్స్ అండగా ఆకర్షించే విధంగా లేవు. ఏజ్డ్ ఫేస్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. హన్సిక కంటే కూడా మురళీ శర్మ నటన ఆకట్టుకుంటుంది. ఆల్మోస్ట్ ఈ సినిమాలో ఇతనే హీరో అనిపించే విధంగా ఉంటుంది అతని పాత్ర. దీనికి వందకి వంద శాతం న్యాయం చేశాడు మురళీ శర్మ. అలాగే ‘ఆడుకలం’ నరేన్ కూడా చాలా బాగా నటించాడు.
సీనియర్ హీరోయిన్ ప్రేమ పాత్ర గెస్ట్ రోల్ మాదిరి అనిపిస్తుంది. ఆమె లుక్స్ కూడా.. అసలు ఈమె ప్రేమేనా? అనిపించే విధంగా ఉంటాయి. నటన పరంగా కూడా ఆమె పెద్దగా ఇంప్రెస్ చేసింది లేదు. ఇక కమెడియన్ ప్రవీణ్ కి ఈ సినిమాతో మంచి రోల్ దొరికినట్టు అయ్యింది. పూజా రామచంద్రన్ మరోసారి బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపిస్తారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ ఎంపిక చేసుకున్న స్కిన్ మాఫియా పాయింట్ బాగానే ఉంది. కానీ ఎందుకో కొంచెం ‘యశోద’ పోలికలు కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ పరంగా సినిమా బాగా ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఓకే అనిపించినా .. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది.
అయితే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. అసలు కథ అక్కడి నుండే మొదలవ్వడం, వరుసగా ట్విస్ట్ లు వస్తుండటం కూడా సీన్ .. సీన్ కి క్యూరియాసిటీ పెరుగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయి. మొత్తంగా సెకండ్ హాఫ్ తో.. ఫస్ట్ హాఫ్ వల్ల కలిగిన అభిప్రాయం మారుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో హన్సిక బాటిల్ తో కొత్తగా పడిపోయిన నటుడి..
బ్లడ్ బయటకి వచ్చే సీన్ ను క్యాప్చర్ చేసిన విజువల్ ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఇంకా బెటర్ గా ఉండాలి. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి.
విశ్లేషణ: ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా.. సెకండ్ హాఫ్ మెప్పిస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే.. హ్యాపీగా ఒకసారి చూసే విధంగానే ఉంది ఈ (My Name Is Shruthi) ‘మై నేమ్ ఈజ్ శృతి’.
రేటింగ్ : 2.5/5