స్టార్ హీరోయిన్ సమంత ‘యశోద’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి.. ట్రైలర్, మూవీ, తన పర్ఫార్మెన్స్ గురించిన న్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. కట్ చేస్తే శనివారం మధ్యాహ్నం ఆమె చేసిన ఓ పోస్ట్ సినీ ఇండస్ట్రీ వారిని, సామ్ అభిమానుల్ని,నెటిజన్లనని షాక్‌కి గురిచేసింది.
‘‘నేను కొంతకాలంగా మ్యోసిటిస్ (కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం నడవలేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కలిగిన వ్యాధి) అనే వ్యాధితో బాధపడుతున్నాను. జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్ళను అంగీకరిస్తూ ముందుకు సాగాల్సిందే. త్వరలోనే కోలుకుంటానని వైద్యులు చెప్పారు. మానసికంగా, శారీరకంగా నేను ఎన్నో కష్టాలను చూశాను.. ఇప్పుడైతే నేను భరించలేననేంత స్థాయిలోనూ కష్టాలు వచ్చాయి.. కానీ అవన్నీ ఎలాగో గడిచిపోయాయి. ఇక ఇది కూడా త్వరలోనే సమసిపోతుంది అని నేను ఆశిస్తున్నాను” అంటూ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
దీంతో ఫ్యాన్స్, సెలబ్రిటీస్ సామ్ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ లాంటి స్టార్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. సమంత బాధపడుతున్న మ్యోసిటిస్ వ్యాధి గురించి నెటిజన్లు వెతకటం మొదలు పెట్టారు. ఆ వ్యాధి ఏంటి? దాని లక్షణాలు ఏంటి? అన్న వివరాల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ‘‘మ్యోసిటిస్’’ ఏంటి? ఆ వ్యాధి అంత ప్రాణాంతకమా?.. దాని గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
మ్యోసిటిస్ అంటే ఏమిటి?.. అవి ఎన్ని రకాలు?..
మ్యోసిటిస్ అనేది మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చే సమస్య కారణంగా సోకుతుంది. మ్యోసిటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే..
పోలీమ్యోసిటిస్.. పోలీమ్యోసిటిస్ శరీరంలోని వివిధ రకాల కండరాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా భుజాలు, నడుము, తొడల కండరాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ఇది మహిళల్లో తరచుగా వస్తూ ఉంటుంది. అది కూడా 30 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు : కండరాళ్ల బలహీనత, కండరాళ్లు నొప్పి తీయటం, అతి నీరసం, కూర్చోవటంలో ఇబ్బంది కలగటం.. ఒకవేళ కూర్చుంటే నిలబడడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. మింగటంలో కూడా సమస్యలు వస్తాయి. తల పైకెత్తి ఎక్కువ సేపు ఉంచలేము. ఎప్పుడూ బాధగా ఉండటం, ఒత్తిడికి గురవటం జరుగుతుంది.
డెర్మటోమ్యోసిటిస్ : డెర్మటోమ్యోసిటిస్ కారణంగా శరీరంలోని వివిధ రకాల కండరాళ్లపై ప్రభావం పడుతుంది. దద్దుర్లలకు దారి తీస్తుంది. ఇది మహిళల్లో తరచుగా వస్తుంది. అంతేకాదు.. పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తుంటుంది. పిల్లల్లో దీన్ని జువెనల్ డెర్మటోమ్యోసిటిస్ అంటారు.
లక్షణాలు : ఈ వ్యాధిలో కూడా పోలీమ్యోసిటిస్‌కు ఉన్న లక్షణాలే ఉంటాయి. అయితే, ఇందులో దద్దుర్లు కూడా ఉంటాయి. కండరాల్లో నొప్పి రావటానికి ముందే ఎరుపు, పర్పుల్, నల్లటి దద్దుర్లు కనిపిస్తాయి. కనురెప్పలు, ముక్కు, బుగ్గలపై దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి ఇవి నడుము, పై రొమ్ము, మోకాళ్లపై వస్తుంటాయి. ఈ వ్యాధిలో దద్దుర్లు దురదను కలిగించటంతోపాటు నొప్పిగా కూడా ఉంటాయి. చర్మం కింద గట్టి గుజ్జు కూడా ఉంటుంది..
అయితే సమంత గత కొంత కాలంగా ఈ వ్యాధితో బాధపడుతూనే.. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తెలుగుతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కూడా కమిట్ అయ్యింది. సామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలు ఆమె స్టార్‌డమ్‌ని మరింత పెంచుతాయంటున్నారు మేకర్స్.. సమంత త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో కనిపించాలని కోరుకుంటున్నారు అభిమానులు..