ఒకే నిర్మాణ సంస్థ వరుస సినిమాలు తీయడం చూశాం, ఒకే నిర్మాణ సంస్థ ఏటా ఒకే సీజన్‌లో సినిమాలు విడుదల చేయడం చూశాం, ఒకే నిర్మాణ సంస్థ స్టార్ హీరోల డేట్స్‌ని గుంపగుత్తగా తీసుకోవడం చూశాం, ఒకే నిర్మాణ సంస్థ ఏక కాలంలో పెద్ద హీరోలతో సినిమాలు చేయడం చూశాం. అయితే ఒకే నిర్మాణ సంస్థ నుండి రూపొందుతున్న రెండు పెద్ద సినిమాలు ఒకే సీజన్‌లో రావడం చూశారా? ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఆ సీన్‌ను చూడబోతున్నారు. ఇలాంటి సీన్ ఏ ఇండస్ట్రీలోనూ వచ్చి ఉండదు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా గ్రేట్.
అయితే ఇప్పుడు పరిస్థితి అలా అనిపించడం లేదు. దీనికి కారణం వేరే సినిమా విషయంలో ఇండస్ట్రీలో వచ్చిన చిన్నపాటి మాటల యుద్ధమే అని చెప్పాలి. టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సంచలనం అని చెప్పాలి. అగ్ర హీరోలు, స్టార్ హీరోలకు వరుసగా అడ్వాన్స్‌లు ఇస్తూ.. సినిమాలు చేస్తూ.. విజయాలు సాధిస్తూ పోతోంది. అయితే ఆ సంస్థ నుండి రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ ఇప్పుడు ఒకేసారి వస్తున్నాయి. వచ్చే పొంగల్‌కి ఈ సినిమాల ఫైట్ ఉండనుంది.
అయితే తెలుగు సినిమాలకే ప్రాధాన్యమివ్వాలంటూ నిర్మాతల మండలి ఓ నోట్ విడుదల చేసిన నేపథ్యంలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో అశ్వనీదత్ మాట్లాడుతూ.. ‘ఒకే నిర్మాణ సంస్థ రెండు సినిమాలు చేసి.. ఒకేసారి విడుదల చేయొచ్చు.. కానీ తమిళ సినిమా ఎందుకు రాకూడదు’ అంటూ ప్రశ్నించారు. దీంతో మైత్రీ వాళ్లు చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న మొదలైంది. ఇండస్ట్రీలో చిన్నగా మొదలైన ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నిజానికి అలా సినిమాలు రాకూడదా.. అలాంటి రూల్ ఏం లేదనే చెప్పాలి. అయితే నిర్మాతల మండలి చెప్పిన మాట కూడా కొత్తదేం కాదు. ఇప్పుడు తమిళ సినిమాను తీసుకొస్తున్న నిర్మాత ఒకప్పుడు మాట్లాడిన మాటే. కానీ ఎవరో ఏదో అని, దానిని ఇంకెవరో ఇంకెవరో సమర్థించి.. ఆ మొత్తం ఇష్యూ మైత్రీ వాళ్ల మీద పడింది. ఇదేనేమో ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే. నిజానికి రెండు సినిమాలు ఒకేసారి విడుదల చేయడం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకూ కష్టమే. కానీ తప్పని పరిస్థితిలో విడుదల చేస్తున్నారు.