తన పాటల విషయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) చాలా పట్టుదలగా ఉంటారు. ఆయన పాటల్ని ఆయన అనుమతి తీసుకోకుండా ఎవరైనా వాడుకుంటే ఆయన ఆగ్రహానికి గురవ్వాల్సందే. ఆ వెంటనే భారీ నష్టపరిహారం కూడా డిమాండ్ చేస్తారు. అలా ఇప్పుడు ఆయన అజిత్ (Ajith Kumar) హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమా టీమ్ మీద భారీ నష్టపరిహారం కోసం లీగల్ నోటీసులు పంపించారు. తాజాగా ఈ వ్యవహారంపై నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకు నిర్మాతలకు లీగల్ నోటీసులు రావడం ఇటు కోలీవుడ్‌లో, అటు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తన పాత పాటల్ని తనకు చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా వాడేశారు అనేది ఇళయరాజా వాదన. అందుకే నోటీసులు పంపారు. గతంలో కూడా ఆయన ఇలా కొన్ని సినిమాల టీమ్‌లకు నోటీసులు పంపడం, ఆ విషయంలో పెద్ద చర్చ జరగడం చూసే ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరగడంతో ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ స్పందించారు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలోని కొన్ని బిట్ సాంగ్స్‌కు సంబంధించి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ తీసుకున్నామని రవింశంకర్ (Y .Ravi Shankar) తెలిపారు. ఆయా పాటల హక్కులు ఉన్న మ్యూజిక్ కంపెనీల నుండి పర్మిషన్ తీసుకున్నామని తెలిపారు. పాటలు హక్కులు ఆయా కంపెనీలకే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పాటల వినియోగం విషయంలో పూర్తి ప్రోటోకాల్ ఫాలో అయ్యామని, అంతా చట్టప్రకారమే చేశామని చెప్పుకొచ్చారు.
అయితే ఇళయరాజా విషయంలో చట్టంతోపాటు.. ఆయన ఓ సంస్థతో చేసుకున్న సంగీతం అగ్రిమెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయం ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఇక అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) తెరకెక్కించిన సినిమా ఏప్రిల్ 10న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తొలి ఐదు రోజుల్లోనే సినిమా తమిళనాటు రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది అని తమిళ మీడియా చెబుతోంది.