“దువ్వాడ జగన్నాధం” అనంతరం అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “నా పేరు సూర్య”. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మించారు. అల్లు అర్జున్ ఆర్మీ సోల్జర్ గా నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. మరి సూర్య ఆ అంచనాలను చేరుకోగలిగాడా లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ : దేశభక్తి, నిర్వార్ధమైన మనస్తత్వం, ఆర్మీ అంటే పిచ్చి ఉన్న పరిపూర్ణమైన సైనికుడు సూర్య (అల్లు అర్జున్). ఇన్ని మంచి లక్షణాలున్న సైనికుడికి ఉండకూడని ఒకే ఒక్క సమస్య కోపం. కోపంలో మనసుకి అనిపించింది చేయడం తప్ప ఉచ్చనీచాలు చూడని సూర్యకు ఎప్పటికైనా బోర్డర్ లో డ్యూటీ చేయాలన్నదే జీవితాశయం. అయితే.. అదే కోపం అతడ్ని ఆర్మీ నుంచి బయటకి పంపుతుంది. తిరిగి ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఇండియాలోనే నెంబర్ ఒన్ సైకాలజిస్ట్ అయిన రామకృష్ణంరాజు దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టించుకొని వస్తే తప్ప ఆర్మీ కాంపౌండ్ లోకి ఎంట్రీ ఉండదు.
కట్ చేస్తే.. ఆ రామకృష్ణంరాజు మరెవరో కాదు.. తన కోపాన్ని భరించలేక తనను ఇంట్లో నుంచి బయటకి వచ్చేస్తున్నప్పుడు కనీసం ఆపడానికి ప్రయత్నించకుండా మిన్నకుండిపోయిన తండ్రే. సో, తండ్రి దగ్గరనుంచి సూర్య “నో అబ్జెక్షన్ సర్టిఫికెట్” తెచ్చుకోగలిగాడా లేదా? అందుకోసం అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి అనేది “నా పేరు సూర్య” కథాంశం.
నటీనటుల పనితీరు : పట్టరాని కోపంతో ఊగిపోయే సైనికుడిగా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్, ఫిజిక్, మేనరిజమ్స్ తో విశేషంగా ఆకట్టుకొన్నాడు. సినిమా చూస్తున్నంతసేపు పాటల్లో తప్పితే ప్రతి సన్నివేశంలోనూ అల్లు అర్జున్ కనిపించడు కేవలం సూర్య అనే సోల్జర్ మాత్రమే కనిపిస్తాడు. ఆస్థాయిలో పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు అల్లు అర్జున్. అయితే.. క్యారెక్టరైజేషన్ చివరివరకూ ఒక స్కేల్ అనేది లేకపోవడంతో ట్రాన్స్ ఫార్మేషన్ ఎపిసోడ్స్ & క్లైమాక్స్ లో అల్లు అర్జున్ హావభావాలు మిస్ ఫైర్ అయ్యాయి.
అయితే.. “లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో” పాటలో క్యాప్ ట్రిక్ అండ్ కొన్ని స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్ కోసం అల్లు అర్జున్ పడిన శ్రమను అభినందించకుండా ఉండలేం. అను ఎమ్మాన్యూల్ పాటకి రెండు నిమిషాల ముందు వచ్చి, పాటయ్యాక మాయమైపోవడంతోపాటు గ్లామర్ డోస్ కాస్త పెంచింది. ఎప్పట్లానే ఎక్స్ ప్రేషన్స్ లేకుండా బ్లాంక్ ఫేస్ తో హాట్ ఎక్స్ పోజర్ తో అలరించడానికి ప్రయత్నించి మళ్ళీ ఫెయిల్ అయ్యింది. అమ్మడు ఇకనైనా సొగసుల మీద మాత్రమే కాకుండా నటన మీద కూడా కాన్సన్ ట్రేట్ చేయకపోతే కష్టమే.
యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో రామకృష్ణంరాజు అనే సైకాలజిస్ట్ పాత్రలో తనదైన శైలి నటనతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయన పాత్రకి ఇచ్చినంత వెయిట్ సన్నివేశాల్లో లేకపోవడం, ఎక్కువగా ఆయన్ను బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లా వాడడం అనేది అర్జున్ అభిమానులను మాత్రమే కాదు చిన్నప్పట్నుంచి ఆయన్ను “యాక్షన్ కింగ్”లా చూసిన సగటు సినిమా అభిమానికి కూడా నచ్చదు. శరత్ కుమార్, సాయికుమార్, ఠాకూర్ అనూప్ సింగ్, హరీష్ ఉత్తమన్ వంటి అద్భుతమైన ఆర్టిస్టులు తెర నిండుగా ఉన్నా.. వారి పాత్రలు ఆకట్టుకొనే స్థాయిలో లేకపోవడంతో ఏదో వెలితిగా ఉంటుంది సినిమా మొత్తం. వెన్నెల కిషోర్ నవ్వించడానికి కాస్త ప్రయత్నించాడు కానీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు : రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లోనూ సీరియస్ నెస్ తీసుకురావడానికి ఆయన ప్రయత్నించిన విధానాన్ని మెచ్చుకోవచ్చు. సన్నివేశంలోని ఎమోషన్ ను తెరపై నుండి ప్రేక్షకుడి మనసులోకి ప్రవేశింపజేయడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రశంసార్హం. విశాల్ శేఖర్ ద్వయం అందించిన సంగీతం ట్రెండీగా ఉంది. “లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో, ఇరగ ఇరగ” పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి. అయితే.. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అల్లు అర్జున్ కి కోపమొచ్చినప్పుడల్లా ఇచ్చిన బీజీయమ్ మినహా మిగతా వర్క్ మొత్తం చాలా పేలవంగా ఉంది.
ఎడిటింగ్, డి.ఐ, కలరింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ లో అల్లు అర్జున్ కోపాన్ని కంట్రోల్ చేసుకొంటున్నట్లు ఎలాబరేట్ చేయడానికి పిక్చరైజ్ చేసిన సన్నివేశాల లెంగ్త్ ఎక్కువైంది.
డైరెక్టర్ వక్కంతం వంశీ రచయితగా వర్క్ చేసిన “కిక్, టెంపర్” లాంటి సినిమాలకే కథ అంత అద్భుతంగా రాశాడంటే.. తన స్వంత డైరెక్షన్ లో వస్తున్న “నా పేరు సూర్య”కి ఇంకా అద్భుతమైన కథ రాసుకొని ఉంటాడు అని అందరూ సాధారణంగానే ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ… వంశీ పేలవమైన కథను పక్కనపెట్టేస్తే.. 15 ఏళ్ళు పెంచిన తల్లి.. 12 ఏళ్ల తర్వాత తన ఇంటి ఎదురుగా ఉంటున్న అబ్బాయిని తన కొడుకుగా గుర్తుపట్టకపోవడం అనే విషయం ఎంత వరకూ కరెక్ట్ అనే సిల్లీ లాజిక్ ను గాలికొదిలేసి గుడ్డిగా ఏదో గొప్ప ఎమోషన్ ఉన్నట్లుగా తల్లీకొడుకుల నడుమ సీన్ రాసుకొన్న విధానం వంశీ ప్రతిభకు నిదర్శనం. ఇక క్లైమాక్స్ లో హీరో-విలన్ కొట్టుకోవడం హీరో గెలవడం లాంటి రొటీన్ క్లైమాక్స్ కాకుండా ఏదో కొత్తగా రాసుకొన్నాడు అని ప్రేక్షకులు ఆలోచించేలోపే “ఇండియా కావాలి” అని అల్లు అర్జున్ తో అనిపించి ఆసక్తి పెంచి.. అప్పటివరకూ ఒక ఫామ్ లో ఉన్న కథను ఇంకో తీరానికి తీసుకుపోయి ఒక్కసారిగా గాలితీసేశాడు. ఒక దర్శకుడిగా మాత్రమే కాక ఒక రచయితగానూ “కిక్ 2” స్థాయిలో ఫెయిల్ అయ్యాడు వక్కంతం వంశీ.
విశ్లేషణ : కేవలం అల్లు అర్జున్ వీరాభిమాన గణాన్ని మినహా సాధారణ ప్రేక్షకులను కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేని “నా పేరు సూర్య” చిత్రం ఈ వేసవికి సినీ ప్రేమికుడి దాహాన్ని తీర్చడం పక్కన పెడితే.. అర్ధాకలితో థియేటర్ల నుంచి వీడేలా చేస్తుంది.