‘జబర్దస్త్’ షో గురించి ఈమధ్య ఎక్కువ వార్తలు రావడం అలాగే వీటి పై సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ షో నుండీ జడ్జి నాగబాబు తప్పుకోవడం పై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. ఈ విషయం నాగబాబే స్వయంగా క్లారిటీ ఇస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో జబర్దస్త్ మొదలు కాకముందు నాగబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేదాని పై కూడా వీడియో రిలీజ్ చేసాడు.
ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. ” ‘జబర్దస్త్’ షోను ముందుగా 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేశారు. అందుకు మాత్రమే జడ్జిగా ఉండమని నన్ను అడిగారు. నాతో పాటు రోజా కూడా జడ్జిగా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే 25 ఎపిసోడ్స్ ఏంటి.. షో నచ్చితే ఎన్ని ఎపిసోడ్స్ అయినా చేసేందుకు నేను రెడీ అని అనుకున్నాను. కానీ సరిగ్గా అదే టైంలో.. నేను ‘ప్రజారాజ్యం’ నుండీ కాంగ్రెస్ వైపు వెళ్ళడం.. మరోవైపు రోజా తెలుగుదేశం నుండీ వైసీపీలో చేరడం జరిగింది. నేను, రోజా.. ఇద్దరం ప్రత్యర్ధి పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ షోలో చేయాలా ? వద్దా ? అని మొదట అలోచించాను. అయితే పొలిటికల్ విభేదాలు వేరు.. క్రియేటివ్ ఫీల్డ్ వేరు కాబట్టి.. నేను జడ్జిగా చేసేందుకు ఒప్పుకున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు.