“అరుంధతి” అనంతరం కోడి రామకృష్ణ తెరకెక్కించిన మరో గ్రాఫిక్ వండర్ “నాగభరణం”. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనువాదరూపంలో తెలుగులో విడుదల చేశారు. కన్నడ స్టార్ నటులు దివంగత విష్ణువర్ధన్ ను ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ద్వారా రీక్రియేట్ చేయబడడం ప్రత్యేక ఆకర్షణగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : సూర్య గ్రహణం నాడు దేవాదులందరూ తమ శక్తులను కోల్పోయి అసురుల నుంచి ప్రాణ భయంతో తప్పించుకొని తిరిగే వేళ.. వారి రక్షణార్ధం త్రిమూర్తులు సృష్టించిన “మహా కలశం” యుగయుగాలుగా దేవతలను రక్షిస్తూ ఉంటుంది. అంతటి మహాశక్తి కలిగిన ఆ కలశం కలికాలంలో సాధారణ మనుషులకు దొరకగా.. కొన్నాళ్లపాటు మ్యూజియంలో ఉంచి, ఓ మ్యూజిక్ కాంపిటీషన్ ఓ బహుమతిగా ప్రకటిస్తారు. ఆ కలశాన్ని దక్కించుకొంటే.. ప్రపంచాన్ని ఏలే శక్తి సొంతమవుతుందని తెలిసిన కొందరు ఆ కాలశాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
కట్ చేస్తే.. నాగ్ చరణ్ (దిగంత్) “రోయల్ కోబ్రా బాండ్” అనే మ్యూజికల్ ట్రూప్ ని రన్ చేస్తుంటాడు. ఈ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి సన్నద్ధమవుతుంటాడు. ఇతడి టీం లో ఆఖరి నిమిషంలో జాయిన్ అవుతుంది మానస (రమ్య). అసలు మానస ఎవరు, చరణ్ గ్రూప్ లో ఉండుకు జాయిన్ అవుతుంది, చరణ్ కాంపిటీషన్ లో గెలిచాడా, చరణ్ ను అడ్డుకొనేందుకు విలన్ గ్యాంగ్ ఏం చేశారు అనేది “నాగభరణం” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు : ఎక్స్ ఎంపీ మరియు ఎక్స్ యాక్ట్రెస్ అయిన రమ్య ఈ చిత్రంలో నాగినిగా అందాలతో కాస్త ఆకట్టుకొన్నప్పటికీ.. పాముగా మారే సన్నివేశాల్లో తన హావభావాల ద్వారా ఇంపాక్ట్ తీసుకురాలేకపోయింది. అందువల్ల ఈ సినిమాకి ఆమె మైనస్ గా మారిందనే చెప్పాలి.
మిగతా నటీనటులందరూ కన్నడ పరిశ్రమకు చెందినవారు కావడంతో సాయికుమార్ మినహా ఒక్కళ్ళని కూడా మనవాళ్ళు గుర్తుపట్టలేరు. కనిపించేది కాసేపే అయినా సాయికుమార్ “శివయ్య” పాత్రలో జీవించారు. కపాలిగా వివేక్ ఉపాధ్యాయ్ నటనవరకూ పర్లేదు కానీ.. బాడీ లాంగ్వేజ్ మాత్రం అస్సలు బాలేదు.
సాంకేతికవర్గం పనితీరు : మకుట గ్రాఫిక్స్ వర్క్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. చాలా షాట్స్ ను ఆంగ్ల చిత్రాల్లో ఎక్కడో చూశాం అనిపించినప్పటికీ.. అద్భుతం అనిపించక మానదు. కాకపోతే.. కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్ ను రీక్రియేట్ చేశామని ఎంతో గొప్పగా చెప్పుకొన్న చిత్ర బృందం ఆ రీక్రియేషన్ తో అనుకొన్న స్థాయిలో మెప్పించలేకపోయింది. చాలా చోట్ల ఫేస్ మాస్కింగ్ సెట్ అవ్వలేదు. హెచ్.సి.వేణు కెమెరా పనితనం బాగుంది. ఓపెనింగ్ సీక్వెన్స్ లోని బుల్లెట్ టైమ్ షాట్ ను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అయితే.. చాలా చోట్ల డి.ఐ కారణంగా గ్రేడింగ్ సరిగా సింక్ అవ్వలేదు. జానీ హర్ష ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ లో చాలా అనవసర సన్నివేశాలు ఉన్నాయి. మరి అవి కన్నడ ఆడియన్స్ ను నచ్చవచ్చేమో. గురుకిరణ్ మ్యూజిక్ 80వ దశకంలోనే ఆగిపోయింది. నేపధ్య సంగీతం మాత్రం శ్లోకాల వరకూ బాగుంది.
దర్శకులు కోడి రామకృష్ణ ఇంకా “అంజి, దేవి” చిత్రాల మూడ్ లోనే ఉండిపోయారని ఈ చిత్రం మరోమారు నిరూపిస్తుంది. హీరోయిన్ ఫ్ళాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం “అరుంధతి”ని దించేసినట్లుగా అనిపిస్తుంది. మొదటి పది నిమిషాలు కథను వివరించిన తీరు చూసి ఇదేదో బాగుంటుంది అనే మూడ్ లోకి వచ్చిన ప్రేక్షకుడి అంచనాలను నెక్స్ట్ సీన్ తోనే తోక్కేశాడు కోడి రామకృష్ణ. కతలోనే కొత్తదనం లేదనుకొంటుంటే.. కథనం మరీ నత్త నడకలా బీసీల కాలంనాటి డైలాగులతో సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ సినిమా తర్వాతైనా దర్శకులు కోడి రామకృష్ణ కనీస స్థాయిలో అప్ డేట్ అవ్వకపోతే సినిమాలు తీయడం మానేయడమే శరణ్యం.
విశ్లేషణ : ఓ 20 నిమిషాల పాటు అలరించే గ్రాఫిక్స్ మినహా కనీస స్థాయిలో ఆకట్టుకోలేని కథనం, లాజిక్ అనేది బూతద్దం పెట్టి వెతికినా కనిపించని కథ, అన్నిటికీ మించి పావళాకి వందరూపాయల నటన ప్రదర్శించే కన్నడ నటుల ఓవర్ యాక్షన్ కలగలిసి “నాగభారణం” చిత్రాన్ని చూడకపోతేనే నయం అనిపిస్తాయి.