ఈగ, లెజెండ్ వంటి పెద్ద సినిమాలతో పాటు ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య సినిమాలతో చిన్న సినిమాలతోనూ సక్సెస్ అందుకుంది వారాహి సంస్థ. తర్వాత చేసిన ‘తుంగభద్ర’ సినిమాకి మాత్రం వ్యాపార పరంగా ఆశించిన ఫలితం రాలేదు. ఇక్కడివరకు లాభ నష్టాలు మాట ఎలా ఉన్నా మంచి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ‘వారాహి’ గతేడాది విడుదలైన ‘రాజుగారి గది’, ‘జతకలిసే’ సినిమాలతో జతకలిసే సరికి వాటి ఫలితం అంటుకుని ఇరకాటంలో పడింది. ‘రాజా చెయ్యి’ వేసినా ఫలితం మారలేదు. అయితే దీని తర్వాత వారాహి సంస్థ నుండి ‘మనమంతా’ లాంటి ఓ మంచి సినిమా వచ్చేసరికి ”తిరనాళ్ళలో తప్పిపోయిన పిల్లాడు దొరికితే ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషపడతారో” ఈ నిర్మాణ సంస్థపై నమ్మకం ఏర్పరుచుకున్న ప్రేక్షకులూ అంతే ఆనందపడ్డారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్థికంగానూ నిలదొక్కుకుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఒక అగ్ర హీరో సినిమా ఫెయిల్ అయినా రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. చిన్న సినిమా విషయంలో ఆ పరిస్థితి వేరు. ఇక్కడ దర్శకుడు, నిర్మాణ సంస్థను నమ్మే థియేటర్ కి వస్తారు ప్రేక్షకులు. గతంలో దిల్ రాజు ఈ దారిలో పయనించే అద్భుత విజయాలు అందుకున్నారు. ఇప్పుడు వారాహి ఆ విజయపథంలో సాగుతోంది. తాజాగా నాగచైతన్య, మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో వారాహి సంస్థలో ఓ సినిమా రానున్నట్టు ప్రకటన వెలువడింది. సున్నిత భావోద్వేగాలు, మంచి హాస్యం కలగలసిన సినిమాలకు ఇంద్రగంటి చిరునామా. ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘జెంటిల్ మేన్’ సినిమాలతో ఆకట్టుకున్న మోహన కృష్ణ, చైతూ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారో మరి.
https://www.youtube.com/watch?v=R1nBw8EbOmI