ఫామ్ లోకి వచ్చిన నాగశౌర్య!

  • December 4, 2017 / 08:12 AM IST

ఒక హీరోగా రాణించడానికి కావాల్సిన అన్నీ అంశాలు పూష్కలంగా ఉన్నప్పటికీ.. సరైన సినిమా పడక వెనుకబడిపోతున్న కథానాయకుడు నాగశౌర్య. “క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్”తో తెరంగేట్రం చేసిన శౌర్యకి పేరొచ్చింది మాత్రం ‘చందమామ కథలు” చిత్రంలో పోషించిన ప్రత్యేక పాత్రతోనే. ఆ తర్వాత “ఊహలు గుసగుసలాడే”తో సూపర్ హిట్ అందుకొని యువ కథానాయకుల రేస్ లో స్థానం సంపాదించుకొన్నాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన “దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి” సినిమాలు వరుస పరాజయాలు చెందడంతో కాస్తంత ఢీలా పడ్డాడు. మళ్ళీ “కళ్యాణ్ వైభోగమే”తో డీసెంట్ హిట్ అందుకొన్న శౌర్యకి “ఒక మనసు, జ్యో అచ్యుతానంద” చిత్రాలతో మళ్ళీ నెమ్మదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎప్పుడో కెరీర్ తొలినాళ్లలో నటించిన “నీ జతలేక” అనే చిత్రం విడుదలై రెండు రోజులు కూడా ఆడకుండా థియేటర్ల నుండి కనుమరుగైంది. ఆ తర్వాత నటించిన “కథలో రాజకుమారి” కూడా పరాజయం పాలవ్వడంతో నాగశౌర్య కెరీర్ కష్టాల్లో పడింది.

అయితే.. ఇదే విధంగా కొనసాగితే తన కెరీర్ కు కరెక్ట్ కాదని గ్రహించి, తానే స్వయంగా నిర్మాతగా మారి త్రివిక్రమ్ అసోసియేట్ వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేస్తూ “ఛలో” చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా నటించాడు. ఇప్పటివరకూ ఏ నాగశౌర్య చిత్రానికి క్రియేట్ అవ్వనంత పాజిటివ్ బజ్ “ఛలో” చిత్రానికి లభించింది. కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్న ఈ చిత్రంపై విడుదలైన టీజర్ వల్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చూస్తుంటే.. శౌర్య “ఛలో”లో లక్కీ ఛాన్స్ కొట్టినట్లే ఉన్నాడు. అలాగే.. తదుపరి చిత్రాల విషయంలోనూ కాస్త పరిణితి ప్రదర్శిస్తే హీరోగా హైట్స్ సునాయాసంగా చేరుకోవచ్చు శౌర్య.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus