పరాజయాలు పరిణితి పెంచాయి!! : నాగశౌర్య

  • July 8, 2020 / 12:04 PM IST

ఇండస్ట్రీలో ఎవరి అండా లేకపోయినా స్వశక్తి, టాలెంట్ తో ఎదిగిన కథానాయకుల్లో నాగశౌర్య ఒకడు. మొదట్లో మంచి హిట్స్ ఉన్నప్పటికీ ఆ తర్వాత కథలో ఎంపిక జాగ్రత్త వహించకపోవడం, మొహమాటానికి కొన్ని సినిమాలు ఒప్పుకోవడం వల్ల హీరోగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడమే కాక మార్కెట్ కూడా దారుణంగా దెబ్బతిన్న తర్వాత మళ్ళీ హీరోగా తన ఉనికిని చాటుకోవడం కోసం శౌర్య చేస్తున్న ప్రయత్నం “ఛలో”. ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న “ఛలో” గురించి, తాను ఇంతకుముందు కొన్ని సినిమాలు ఎందుకు బలవంతంగా చేయాల్సి వచ్చింది, భవిష్యత్ సినిమాల ఎంపికలో తీసుకోబోయే జాగ్రత్తల గురించి శౌర్య చెప్పిన విశేషాలు మీకోసం..!!

ఐరా క్రియేషన్స్ కేవలం మాది మాత్రమే కాదు..
“ఐరా క్రియేషన్స్” అనేది చెప్పుకోవడానికి మా స్వంత సంస్థ అయినప్పటికీ.. దానికి మెయిన్ పిల్లర్స్ మాత్రం మా బంధువులు బుజ్జి, శ్రీనివాసరెడ్డి. వారి అండతోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా “ఛలో” చిత్రీకరణ పూర్తి చేయగలిగామ్. ఇక బ్యానర్ పేరు విషయానికి వస్తే.. మా అమ్మానాన్నలకి ఆడపిల్ల పుడితే “ఐరా” అనే పేరు పెట్టాలనుకొన్నారు. సో ఆ కోరిక ఈ బ్యానర్ రూపంలో తీరిందన్నమాట.

అనుకొన్న కథను ఎప్పుడూ తీయలేము..
ఎంత పెద్ద దర్శకుడైనా, లేక కొత్త దర్శకుడైనా తాను పేపర్ మీద రాసుకొన్న కథను ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ తెరపై చూపలేదు. అయితే అనుకొన్నదానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తాడు, లేదంటే చెత్తగా అయినా తీస్తాడు. మా “ఛలో” విషయంలో మేం అనుకొన్నదానికంటే బెటర్ అవుట్ పుట్ వచ్చింది. అందుకే రిలీజ్ రెండ్రోజుల్లో పెట్టుకొని కూడా చాలా హ్యాపీగా ఉన్నాం.

రామ్ చరణ్ ఇన్స్పిరేషన్..
సినిమా షూటింగ్ అవుతూ ఉంది కానీ.. టైటిల్ ఏం పెట్టాలని అనే విషయంలో మా నాన్నగారితో రోజూ గొడవ అయ్యేది. ఇంకోవారంలో నేనేం చెప్పకపోతే “బయల్దేరినాడే చిన్నోడు” అనే టైటిల్ ఫిక్స్ చేసేస్తా అన్నారు. దెబ్బకి భయపడి ఏదో ఒక టైటిల్ ఫిక్స్ చేద్దాం అనుకొంటున్న టైమ్ లో రేడియోలో “బ్రూస్ లీ” సినిమాలోని “లే ఛలో” సాంగ్ విన్నాక వెంకీతో చెబితే “ఛలో” అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.

నేనేదో తిప్పుకొంటున్నా అన్నారట..
మా డైరెక్టర్ వెంకీ నాకు “జాదూగాడు” టైమ్ నుంచి తెలుసు, ఆ తర్వాత తను డైరెక్టర్ ట్రైల్స్ లో ఉన్నప్పుడు తనతో కలిసి ఎక్కువగా తిరగడం వలన ఎవరో తనతో “నువ్ శౌర్యతో ఎక్కువగా తిరుగుతున్నావ్, అతను నిన్ను తిప్పుకుంటాడే తప్ప దర్శకుడిగా అవకాశమివ్వడు” అన్నారట. నిజానికి వెంకీ నన్ను హీరోగా అనుకొంటున్నాడని నాకు తెలియదు. సో వెంటనే వెంకీని కథ రెడీ చేయమని చెప్పడం, సినిమా స్టార్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

వేళ్లే కాదు కాళ్ళు కూడా పెట్టాను..
ఇదివరకూ నటించిన సినిమాల్లో ఏ అంశమైనా నచ్చకపోతే దర్శకులకు జస్ట్ ఇంటిమేట్ చేసేవాడ్ని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆ ఎఫెక్ట్ నా కెరీర్ మీద పడేది. అందుకే నేను నా బ్యానర్ లో చేస్తున్న “ఛలో” సినిమాలో ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యాను. ఇకపై కూడా నా భవిష్యత్ సినిమాల విషయంలో మొహమాటపడకుండా ఏ విషయమైనా నాకు నచ్చకపోతే దర్శకుడితో విబేధించడానికైనా రెడీ.

పరాజయాలే చాలా నేర్పించాయి..
నేను ఎదుర్కొన్న పరజాయలే నాకు ఎక్కువ గుణపాఠాలు నేర్పాయి. అందులో ముఖ్యమైనది మొహమాటానికిపోయి సినిమాలు చేయకూడదు అని. అలా మొహమాటానికి సినిమాలు చేసే నా కెరీర్ పాడు చేసుకొన్నాను. భవిష్యత్ లో అలాంటి తప్పులు పొరపాటున కూడా చేయను.

హీరో అవ్వడానికి ముందు నేను మంచి ఆడియన్ ను..
ఇప్పుడంటే హీరో అయ్యాక నా జస్టిఫికేషన్ దెబ్బతిన్నది కానీ.. నిజానికి నేను మంచి ఆడియన్ ని. “ఛలో” కథ కూడా ఒక ఆడియన్ గానే విన్నాను, ఆడియన్స్ కి నచ్చేలా డిజైన్ చేసుకొన్నామ్. మా అమ్మ కూడా నన్ను తెరపై ఎలా చూడాలనుకొంటుందో అలాగే డైరెక్టర్ కి చెప్పి చేయించుకుంది.

చిన్నప్పట్నుంచి చాలా మొండోడ్ని..
చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడ్ని, ముఖ్యంగా స్టడీస్ విషయంలో మా అమ్మ నన్ను చితక్కొట్టేది. మొదట్లో భయపడినా.. తర్వాత అలవాటైపోయి అమ్మ కొడుతున్నప్పుడు పరిగెట్టడం మానేసి అక్కడే నిల్చోని ఉండేవాడ్ని. అడిగితే.. “ఎలాగో కొడతావు, పరిగెడితే ఇంకా కసిగా కొడతావు, అందుకే అలా నిల్చోవడం బెటర్” అని చెప్పేవాడ్ని. సినిమాలో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. అందుకే చాలా రియలిస్టిక్ గా యాక్ట్ చేయగలిగాను.

అది రెండున్నరేళ్ల క్రితం అనుకున్న కాంబో..
కెమెరామెన్ సాయిశ్రీరామ్ గారితో రెండున్నరేళ్ల క్రితమే సినిమా అనుకొన్నామ్. కానీ కథ సెట్ అవ్వక సెట్స్ మీదకి రాలేదు. రీసెంట్ గా స్టోరీ కుదిరింది, అందుకే “ఛలో” తర్వాత ఇమ్మీడియట్ గా సాయిశ్రీరామ్ ప్రొజెక్ట్ పైప్ లైన్ లోకి తీసుకొచ్చామ్. అది మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ. నటుడిగా నాలోని సరికొత్త యాంగిల్ ఆ సినిమాతో బయటకొస్తుంది.

ఇంత చీప్ ప్రొడక్షన్ వేల్యూస్ ఎక్కడా చూడలేదు అన్నా..
“ఛలో” స్టార్ట్ చేసినప్పుడు ఎవరికీ సినిమా తీయడం గురించి పూర్తి అవగాహన లేదు. గుంటూర్ వెళ్ళి 11 రోజుల్లో ఒక 3 సన్నివేశాలు షూట్ చేసుకొని వచ్చాం. అవుట్ పుట్ చూసుకున్నాక భయం వేసింది. వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి “ఇంత చీప్ ప్రొడక్షన్ వేల్యూస్ ఎక్కడా చూడలేదు” అని చెప్పి కోపంగా కాల్ కట్ చేశా. ఆ ఫోన్ ఎఫెక్ట్ బాగా పనికొచ్చింది.

కథ వినకుండానే కథలో రాజకుమారిలో..
నా కెరీర్ లో నేను చేసిన పెద్ద మిస్టేక్స్ లో “కథలో రాజకుమారి” ఒకటి. అసలు కథ వినకుండా కేవలం నారా రోహిత్ కోసం ఆ సినిమా చేయాల్సి వచ్చింది. సినిమా రిలీజయ్యాక చాలా బాధపడ్డాను. నేను ఎమోషనల్ గా చేసిన మిస్టేక్స్ లో అది ఒకటి.

నెక్స్ట్ సినిమా “నర్తనశాల”
సాయిశ్రీరామ్ సినిమా మార్చి నుంచి రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. ఆ తర్వాత కృష్ణవంశీగారి అసిస్టెంట్ శ్రీనివాస్ అనే కుర్రాడి దర్శకత్వంలో “నర్తనశాల” అనే సినిమా స్టార్ట్ చేస్తాం. ఇంకో రెండు కథలు పైప్ లైన్ లో ఉన్నాయి.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus