మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పని చేసే వ్యక్తి డబ్బులు దొగలించడమనే సంఘటన మరిచికపోక ముందే.. సినిమా వర్గానికి చెందిన మరొకరికి నమ్మిన వ్యక్తి టోపీ పెట్టారు. నమ్మి వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తే అసలుకే ఎసరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో నివాసముండే అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల, శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్న చింతలపూడి శ్రీనివాసరావు స్థిరాస్తి వ్యాపారంలో భాగస్వాములు. ఫిబ్రవరి 8, 2010న ఎస్‌ఆర్ ప్రాపర్టీస్ పేరుతో రియల్‌ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు.
సంస్థ పేరుమీదే విశాఖపట్నం సమీపంలోని భోగాపురం, విజయనగరం ప్రాంతాల్లో 12 కోట్ల విలువ చేసే భూములను కొనుగోలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలో ఆరు ఎకరాలు, మరో ప్రాంతంలో 34 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందుకు అవసరమైన డబ్బును నాగసుశీల పెట్టుబడిగా పెట్టారు. ఇదే సమయంలో శ్రీనివాస్ తన పేరుమీద, తన భార్య సునీత పేరు మీద ఎస్‌ఆర్ ప్రమోటర్స్ అనే మరో సంస్థను ప్రారంభించారు. చిన మంగళవారంలో కొనుగోలు చేసిన 2.36 కోట్ల విలువ చేసే 12 ప్లాట్లను 71,12,500లకు విక్రయించి ఆ మొత్తాన్ని తన సంస్థకు బదలాయించుకున్నారు.
ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న నాగ సుశీల అక్టోబర్ 13, 2017న శ్రీనివాస్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, విచారణ జరిపిస్తున్నట్టు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. నెల క్రితం కేసు నమోదు అవ్వగా ఇన్ని రోజులకు బయటకి రావడం విశేషం.