యువ నిర్మాత నాగవంశీ – మీడియా – పీఆర్‌ఓలు.. బంధం చాలా స్పెషల్. ఆయన నిర్మాతగా మారిన ఎర్లీ డేస్ నుండి ఆయన మీడియాతో డిఫరెంట్ ర్యాపోలో ఉంటారు. కావాల్సినప్పుడు ప్రేమగా, కోపమొచ్చినప్పుడు చిరాకుగా ఆయన మీడియాతో ఉంటారు. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుండం, పెద్ద వారితో కలసి సినిమా నిర్మిస్తుండటంతో ఆయన విషయంలో మీడియా ఎప్పుడూ అటు ఇటుగా మాట్లాడింది లేదు. అయితే ఆయన మాత్రం ఆ గీతలేవీ గీసుకోకుండానే మాట్లాడారు. ఈ క్రమంలో మీడియాను ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో పోల్చారు. అంతేకాదు ఆయనకు, మీడియాకు మధ్య అనుసంధానంగా ఉండే పీఆర్‌ఓల మీద కూడా నాలుగు చెణుకులు విసిరారు.
తన కొత్త సినిమా ‘కింగ్డ్‌మ్’ ప్రచారంలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ మీడియా ముందుకు ఇంకా రాలేదు కానీ.. నిర్మాత నాగవంశీ మాత్రం వచ్చేశారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను, తన ఐడియాలజీని ప్రచారం చేసుకుంటున్నారు. ఇతర నిర్మాతలకు, తనకు చాలా తేడా ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలో మీడియా గురించి, పీఆర్‌ఓల పని విధానం గురించి మాట్లాడారు. ‘‘పీఆర్‌ఓలు మమ్మల్ని (నిర్మాతల్ని) బెదిరిస్తున్నారు. ఈ పని చేయకపోతే మన సినిమా పని అయిపోతుంది. కచ్చితంగా చేయాల్సిందే’’ అని నాగవంశీ చెప్పారు.
‘‘పీఆర్‌ఓలు కొంతమంది అలా తయారై నిర్మాతల్ని అలా భయపెట్టేశారు. మరోవైపు మేం రూ. వంద కోట్లుపైగా పెట్టి సినిమాలు చేస్తున్నాం. రూ.30 లక్షలు పెట్టి ప్రచారం చేయకపోతే ఇబ్బంది అని పీఆర్‌ఓలు చెవులో జోరీగల్లా చెబుతూనే ఉంటున్నారు. దీంతో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మా నిర్మాతల పరిస్థితి అలా మారిపోయింది’’ అని నాగ వంశీ కాస్త అసహనంగా చెప్పుకొచ్చారు. దీంతో మీడియాలో వస్తున్న సినిమాలకు సంబంధించిన వార్తలు నిజమా కావా అనేది కూడా తెలియడం లేదు అని చెప్పారు. ప్రస్తుతం అందరి నిర్మాతల పరిస్థితి ఇలానే ఉంది.
ఇక మీడియా గురించి మాట్లాడుతూ ‘‘నాకు, మీడియాకు మధ్య గ్యాప్ ఉందీ అంటే ఉంది లేదంటే లేదు. మాట్లాడకుండా ఉండలేం, వదిలేసి ఉండలేను. చూస్తుంటే మీడియాకు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ లా ఉంది’’ అని నాగవంశీ అన్నారు. ఆయన మాటల వెనుక ఉద్దేశం ఏమో కానీ.. మాటలు అయితే వైరల్ అయ్యాయి. దాంతోపాటు సినిమా పరిశ్రమలోని మరో డార్క్ సైడ్‌ని తెలియజేశాయి.