ప్రముఖ నటుడు మంగలంపల్లి వెంకటేశ్ అలియాస్ ఫిష్ వెంకట్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన ఇటీవల కన్నుమూశారు. రెండు కిడ్నీలు పాడవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స పొందలేక చనిపోయారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె స్రవంతి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
తన తండ్రి వైద్య ఖర్చుల కోసం రూ. 60 లక్షలు అవసరమని, సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆయన కుమార్తె చెప్పినట్లు సమాచారం. రూ. 60 లక్షలు తమ వద్ద ఉండుంటే, లేదంటే ఎవరైనా ఇచ్చి ఉంటే తన తండ్రి బ్రతికేవారని స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యానికి రూ. 50 లక్షల నుండి రూ.60 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో చాలామందిని అడగడానికి ప్రయత్నించాం.
సినిమా పరిశ్రమకు చెందిన కొంతమందిని కూడా అడిగే ప్రయత్నం చేశామని.. ఎలాంటి స్పందన రాలేదని ఆమె చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఇద్దరు అగ్ర హీరోల పేర్లు కూడా ప్రస్తావించారు. ఎవరికి కాల్ చేసినా బయట దేశాల్లో ఉన్నారని చెప్పారని ఆమె అన్నారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇటీవల సమాచారం రాగానే.. ఓ అగ్ర పాన్ ఇండియా హీరో కాల్ చేసి మాట్లాడారని, సాయం చేస్తారని చెప్పినట్లు వార్తలొచ్చాయి. అయితే అది ఫేక్ అని తేలింది.
ఆ స్టార్ హీరో టీమ్ కాల్ చేసినా ఎలాంటి సాయం చేస్తామని హామీ ఇవ్వలేదని ఆమె అప్పుడే తెలిపారు. ఇప్పుడు మరో స్టార్ హీరోతో మాట్లాడదామని ట్రై చేస్తే ఎలాంటి స్పందన రాలేదని ఆమె తెలిపారు. ఆయన పాన్ ఇండియా మూవీ ఇటీవల విడుదలైంది. అయితే తాము వారి టీమ్‌ను సంప్రదించిన విషయం ఆ హీరోలకు తెలియకపోయి ఉండొచ్చు అని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.