టాలీవుడ్‌లో ఇప్పుడు నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. “లోకా లాంటి సినిమాను తెలుగులో తీస్తే ల్యాగ్ అంటారు, అదే మలయాళంలో వస్తే కల్ట్ అంటారు” అంటూ ఆయన చేసిన కామెంట్స్, తెలుగు ప్రేక్షకుల అభిరుచిని ప్రశ్నించేలా ఉన్నాయి. ‘లోకా’ వంటి సినిమాలను ఉదాహరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. ఇది కేవలం ఒక నిర్మాత ఆవేదనా? లేక ఇండస్ట్రీ మొత్తానికి ఉన్న సందేహమా?
నాగవంశీ మాటలు ఒక కొత్త చర్చకు తెరలేపాయి.. అసలు లోపం ఎక్కడుంది? ప్రేక్షకుల్లోనా లేక నిర్మాతల్లోనా? “మనవాళ్లు తీస్తే రొటీన్, పక్కవాళ్లు తీస్తే ప్రయోగం” అనే ధోరణి ప్రేక్షకుల్లో నిజంగానే ఉందా? లేక, క్వాలిటీ లేని కంటెంట్‌ను కప్పిపుచ్చుకోవడానికి నిర్మాతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్టీఆర్ కూడా దేవర టైమ్ లో దాదాపు ఇదే తరహాలో మాట్లాడటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
అయితే, ప్రేక్షకుల వెర్షన్ పూర్తిగా భిన్నంగా ఉంది. “మేము కంటెంట్‌ను మాత్రమే చూస్తాం, భాషను కాదు” అని వారు గట్టిగా చెబుతున్నారు. ‘బలగం’, ‘మసూద’ వంటి చిన్న సినిమాలు, ఎలాంటి స్టార్ సపోర్ట్ లేకపోయినా, కేవలం కథా బలంతోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. “కథలో దమ్ముంటే, తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు” అనడానికి ఇవే నిదర్శనాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు, “మా సమయం, డబ్బు విలువైనవి. ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే హక్కు మాకుంది” అని మరో వర్గం వాదిస్తోంది. రివ్యూలు, టాక్‌తో సంబంధం లేకుండా, నచ్చిన సినిమాలను ఆదరించిన సందర్భాలు కోకొల్లలు. మేకర్స్ తమ వైఫల్యాలను అంగీకరించకుండా, నిందను ప్రేక్షకులపై వేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, ఈ వివాదం ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు మధ్య ఉన్న గ్యాప్‌ను సూచిస్తోంది. ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో మన దర్శకనిర్మాతలు ఎక్కడ తడబడుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కొందరి మాట. ఏది ఏమైనా, చివరికి గెలిచేది కంటెంట్ ఉన్న సినిమానే అనేది కాదనలేని వాస్తవం.