టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రేమ కథలకు పెట్టింది పేరు. రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగ్ తన స్టైల్ మార్చారు. నేటి ట్రెండ్ కి తగినట్లుగా కథలను ఎంపిక చేసుకొని విజయాలను సొంతం చేసుకుంటు న్నారు. ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’ లాంటి విభిన్నమైన కథలతో పలకరించారు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు హీరో గా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ లో కొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో అక్కినేని నాగార్జున పలు విషయాలను వెల్లడించారు.
“ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. రొటీన్ కథలతో సినిమాలు చేస్తే ఎంత పెద్ద స్టార్ సినిమాలైనా చూడరు. మనం మారలేదంటే వారు మరిచిపోతారు. అందుకే తప్పనిసరిగా మారి కొత్త రకం పాత్రలను ఎంచుకుంటున్నాను’ అని నాగ్ వెల్లడించారు. మీ తనయులు పరిశ్రమలోకి వచ్చారు కదా.. వారిని మీకు పోటీగా భావిస్తున్నారా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అయన స్పందిస్తూ “నేను వారికి పోటీ కాదు. నాకు వారు కాదు. మరో విషయం నాలా వాళ్లు ప్రయోగాలు చేయలేరు.” అని చెప్పారు. ప్రస్తుతం నాగార్జున దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్ర దర్శకత్వంలో “ఓం నమో వెంకటేశాయ” సినిమాలో హతీ రామ్ బాబాగా నటిస్తున్నారు.