రంగస్థలం సినిమాలో సమంత నటనపై నాగ్ కామెంట్

పరాయి వాళ్లు ఎంతమంది అభినందించినా కలగని ఆనందం.. సొంతమైన వాళ్లు ఒక్కరు అభినందించినా సంతోషంతో కళ్లు చెమ్మగిల్లుతాయి. అటువంటి ఆనందంలోనే సమంత ఉంది. సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకోకముందు రంగస్థలం ఒప్పుకుంది. అక్కినేని కోడలిగా అడుగుపెట్టినప్పటికీ మునుపటి కంటే ఎక్కువ క్రమశిక్షణతో, శ్రద్ధతో ఈ సినిమాని చేసింది. ఇందులో రామలక్ష్మిగా డీ గ్లామరస్ పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమాని చూసిన ప్రతిఒక్కరూ రామ్ చరణ్ తో పాటు సమంతపై అభినందనలు గుప్పించారు. నాగచైతన్య కూడా ప్రశంసించారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నాగార్జున ఆశ్చర్యపోయారు. వెంటనే తన స్పందనను ట్విట్టర్ వేదికపై తెలిపారు. “చరణ్‌..నువ్వు చాలా అద్భుతంగా నటించావు. పాత్రలో జీవించేశావు.

డియర్‌ సమంత.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. సుకుమార్‌..ఎంత అందమైన సినిమా తెరకెక్కించావ్‌! మమ్మల్ని మళ్లీ ఆ కాలానికి తీసుకెళ్లావ్‌. మైత్రి మూవీ మేకర్స్‌కు శుభాకాంక్షలు” అని ట్వీట్‌ చేశారు. నాగ్ అభినందన చిత్ర యూనిట్ కి సంతోషం కలిగించింది. 1980ల కాలంలోని పల్లెటూరి నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మార్చి 30న విడుదలై పదకొండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 151.29 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా నిలిచింది. ‘మగధీర’ రికార్డును రంగస్థలం బద్దలు కొట్టి… ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా కలెక్షన్స్‌ను క్రాస్ చేయడానికి పరుగులు తీస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus