కింగ్ నాగార్జున (Nagarjuna) హీరోగా నెక్స్ట్ సినిమా గురించి గతకొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లూ చాలా కథలు విన్న నాగ్, ఎట్టకేలకు ఓ ప్రాజెక్టును ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు ఊపందుకున్నాయి. ‘హిట్’ (HIT) ఫేమ్ శైలేష్ కొలనుతో కలిసి నాగార్జున క్రైమ్ థ్రిల్లర్ చేయనున్నట్టు సమాచారం. గతంలోనే శైలేష్ (Sailesh Kolanu) నాగార్జునకు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథ చెప్పారని, ఇప్పుడు కొన్ని మార్పులతో ఆ ప్రాజెక్ట్ ఫైనల్ చేశారని తెలుస్తోంది.
ఈ సినిమా బీహార్‌లో జరిగిన ఓ హత్యా ఘటన ఆధారంగా రూపొందనుందని సమాచారం. నిజ జీవిత ఘటనను ఆధారంగా తీసుకుని శైలేష్ ఈ కథను అల్లినట్లు లీకులు చెబుతున్నాయి. ఇందులో నాగార్జున పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని, గతంలో ఆయన చేసిన పాత్రల కంటే భిన్నంగా ఉంటుందని సమాచారం. శైలేష్ తన మునుపటి సినిమాల మాదిరిగానే స్క్రీన్‌ప్లే నడిపే విధానం ఇక్కడ కూడా స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు.
ప్రస్తుతం శైలేష్ కొలను నాని (Nani) హీరోగా నటించిన ‘హిట్ 3’ (HIT 3) రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మే నెలలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే నాగార్జున సినిమా పనులు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగ్ తాజా చిత్రంపై అధికారిక ప్రకటన ‘హిట్ 3’ విడుదల తర్వాత రావచ్చని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే వెంకటేష్‌తో (Venkatesh) చేసిన ‘సైంధవ్’ (Saindhav) సినిమా ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో శైలేష్ ఈసారి మరింత శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో కలయిక కూడా శైలేష్ కెరీర్‌కు యూ టర్న్ గా మారే అవకాశం ఉంది. మంచి కథతో, కొత్త యాంగిల్‌తో నాగ్ రీ ఎంట్రీ ఇస్తే ప్రేక్షకులు కూడా తిరిగి ఆయనపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. మాస్, క్లాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉండబోతోందట.