కథానాయకుడిగా మూడు దశాబ్ధాల నుండి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న “బాస్” ఆయన, ఇద్దరు తనయులు కథానాయకులుగా తెరంగేట్రం చేసినా.. ఇప్పటికీ తన లుక్స్ తో వారిని నిర్మొహమాటంగా బీట్ చేయగల నవ”మన్మధుడు” కూడా ఆయనే. ఈ సోగ్గాడి 58వ పుట్టినరోజు రేపు (ఆగస్ట్ 29), ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా మిత్రులతో ముచ్చటించారాయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..!!
ఈ సంవత్సరం చాలా స్పెషల్.. నా జీవితంలో 2017 చాలా ప్రత్యేకమైనది. నాగచైతన్య పెళ్లి అవుతోంది, అఖిల్ “హెలో” రిలీజ్ అవుతోంది, అన్నిటికీ మించి “రాజుగారి గది 2” కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతోంది. ఈ హ్యాపీ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నాను.
నన్నో గెస్ట్ లా రమ్మంటున్నారు.. అక్టోబర్ లో నాగచైతన్య-సమంతల పెళ్లి గోవాలో జరగబోతోంది. చాలా సింపుల్ గా చేసుకోవాలని వాళ్లనుకొంటున్నారు. పెళ్లి విషయంలో నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేశారు. ఓన్లీ చెక్ ల మీద సంతకం చేయడం వరకే నా పని. అయితే.. హైద్రాబాద్ లో నా స్థాయిలో రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తాను.
మెంటలిస్ట్ గా నటిస్తున్నాను.. ఇప్పటివరకూ నా కెరీర్ లో నేను పోషించని పాత్ర “రాజుగారి గది 2″లో పోషించనున్నాను. ఒక మెటలిస్ట్ (అంటే విశేషమైన మెమరీతోపాటు అబ్జర్వేషన్ పవర్ ఉన్న వ్యక్తి)గా ఈ చిత్రంలో కనిపించనున్నాను. సినిమా మొత్తం కామెడీ అయినప్పటికీ.. నా పాత్ర మాత్రం కాస్త సీరియస్ గా ఉంటుంది.
మాస్ తో కంపేర్ చేస్తున్నారు.. “రాజుగారి గది 2″లో నా కొత్త స్టిల్స్ చూసి అచ్చు “మాస్” మూవీలో ఉన్నట్లుగానే ఉన్నారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ క్రెడిట్ మొత్తం మా డైరెక్టర్ ఓంకార్ కే చెందుతుంది. జుట్టు ఏమాత్రం పక్కకి చెరిగినా వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి సెట్ చేసేవాడు. అతని డెడికేషన్ అండ్ పర్ఫెక్షన్ లెవల్స్ చూస్తే ఆశ్చర్యమేసేది.
మలయాళ సినిమా ఇన్స్పిరేషన్ తో.. “రాజుగారి గది 2” మలయాళ చిత్రం “ప్రేతమ్” నుండి స్పూర్తి పొంది తెరకెక్కిస్తున్న సినిమా. అందులోని ప్రధాన పాత్రధారి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అది నచ్చే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాను. నేను ఊహించినదానికంటే ఓంకార్ సినిమా చాలా బాగా తీశాడు. నాకు నచ్చకపోతే డబ్బింగ్ చేప్పేవాడ్ని కాదు. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
పాపం వాడేదో గర్ల్ ఫ్రెండ్ కి పంపిద్దాం అనుకొన్నాడు.. అఖిల్ కొత్త సినిమా “హెలో” స్టిల్ లీక్ అవ్వడం సడన్ గా జరిగిపోయింది. “మనం” సినిమాకి వర్క్ చేసిన డిజైనరే “హెలో”కి కూడా వర్క్ చేస్తున్నాడు. అతనేదో తన గర్ల్ ఫ్రెండ్ కి పంపిద్దాం అనుకోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు, అది కాస్తా వైరల్ అయిపోయింది. ఇక మళ్ళీ దాన్ని దాయడం ఎందుకు అని మేం అఫీషియల్ గా ఆరోజు రాత్రే రిలీజ్ చేసేశామ్.
సీనియర్ ఎన్టీయార్ దొరక్క.. జూనియర్ తో నిజానికి “హెలో” ఫస్ట్ లుక్ ను సీనియర్ ఎన్టీయార్ గారు, నాన్నగారు “హెలో” అనే చెప్పే వీడియోతో లాంచ్ చేద్దాం అనుకొన్నాను. కానీ.. సీనియర్ ఎన్టీయార్ గారి వీడియో ఫీడ్ దొరకలేదు. దాంతో జూనియర్ ఎన్టీయార్ నే చెప్పమన్నాం. ఆ తర్వాత అందరు స్టార్ హీరో అండ్ హీరోయిన్స్ తో కూడా చెప్పించి. ఓవరాల్ గా ఒక డిఫరెంట్ వేలో “హెలో” ఫస్ట్ లుక్ ను ఆన్ లైన్ లో విడుదల చేశాం.
ఉదయం ఆరున్నరకు వచ్చిన ఆలోచన అది.. నాకు మంచి ఆలోచనలన్నీ ఉదయం 6 నుండి 6.30 లోపు వస్తుంటాయ్. ఎందుకంటే ఆ టైమ్ కి జిమ్ సహా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా లాన్ లో కూర్చుంటాను. అలా ఒకరోజు ఉదయం సడన్ గా “హెలో” అనే టైటిల్ మైండ్ లోకి వచ్చింది. వెంటనే సుప్రియాకి కాల్ చేసి రిజిష్టర్ చేయమని చెప్పాను.
ఇంకా ఏం కమిట్ అవ్వలేదు.. “రాజుగారి గది 2” అనంతరం ఇంకో సినిమా ఏం కమిట్ అవ్వలేదు. కళ్యాణ్ కృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే “బంగార్రాజు”లో నటించడానికి మాత్రం రెడీగా ఉన్నాను. కళ్యాణ్ దే లేటు.