ప్రేమకథలు, కుటుంబ కథలు లేదంటే స్టైలిష్ యాక్షన్ సినిమాలు. వీటిమధ్య అప్పుడప్పుడు అన్నమయ్య, రామదాసు లాంటి భక్తిరస చిత్రాలు ఇదీ కింగ్ నాగార్జున సినిమాల వరుస. అయితే ఇది నిన్నమొన్నటి మాట. ఇటీవల ఆయన కథల ఎంపికలో తేడా గమనిస్తూనే ఉన్నాం. ఈ సంక్రాంతికి ‘సోగ్గాడి’గా అలరించిన నాగ్ వెంటనే కదలలేని వ్యక్తిగా విక్రమాదిత్య పాత్రకు ‘ఊపిరి’ పోశారు. ఇలా వైవిధ్య కథలవైపు కూడా దృష్టి సారిస్తున్న నాగ్ త్వరలో అంధుడిగాను మెప్పించనున్నట్టు టాలీవుడ్ వర్గాల కథనం.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ తెరకెక్కించిన చిత్రం ‘ఒప్పం’. ఓ అపార్ట్మెంట్ లో పనిచేసేవాడిగా కనిపించిన మోహన్ లాల్ అంధుడిగా అభినయించారు. ఓ హత్యోదంతం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పుతోపాటు లాభాల మూటల్ని రాబట్టింది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ మరియు రీమేక్ హక్కులను ఓవర్సీస్ నెట్ వర్క్ సెంటర్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాని నాగార్జునతో చేయాలని సదరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఆయన ఒప్పుకొని పక్షంలో డబ్బింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మోహన్ లాల్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నారని వినికిడి. అంతాబానే ఉంది కానీ దీనిపై నాగ్ నిర్ణయం ఏమిటో మరి..?