నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు2’ చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. గతంలో వచ్చిన నాగార్జున ‘మన్మధుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగష్టు 9 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా నాగ్ మరో సీక్వెల్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. నాగ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి ‘బంగార్రాజు’ అనే పేరుతో సీక్వెల్ రూపొందించనున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈ సీక్వెల్ పై కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లోనే ఈ చిత్రం కూడా తెరకెక్కనుంది. నాగార్జునే ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. నాగార్జున నిర్మాణంలో సినిమాలు చేసే ప్రతీ దర్శకులకు పారితోషికం ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంటారు. అయితే కళ్యాణ్ కృష్ణకి మాత్రం పారితోషికం ఇవ్వకుండా, సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా ఇస్తానని చెప్పడం సంచలనంగా మారింది. దీనికి దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూడా ఓకే చెప్పాడట. నాగ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటా అని రక రకాల ఊహాగానాలు బయటకి వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ గత చిత్రం ‘నేల టికెట్’ డిజాస్టర్ అయ్యింది కాబట్టి నాగ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కొందరంటుంటే.. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ లో కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలు నాగ్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి కాబట్టి ఈసారి కూడా సినిమా హిట్టయితే కళ్యాణ్ కు మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాల్సి ఉంది.