ప్రస్తుతం సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం సులువైన విషయం కాదు. పది సినిమాలు విడుదలైతే ఒక సినిమాకు హిట్ టాక్ రావడం కూడా కష్టమవుతోంది. అయితే న్యాచురల్ స్టార్ నాని (Nani) మాత్రం కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ విభిన్నమైన కథాంశాలకు ఓటేస్తూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు. కొంతకాలం క్రితం వరకు నాని 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. సక్సెస్ రేట్ పెరుగుతున్నా నాని తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచడం లేదు.
హాయ్ నాన్న సినిమాకు నాని రెమ్యునరేషన్ కు బదులుగా కొన్ని ఏరియాల థియేట్రికల్ హక్కులను తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఒక నిర్మాత నానికి ఏకంగా 50 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఇచ్చారట. రెండు సినిమాల కోసం నానికి ఇంత మొత్తం రెమ్యునరేషన్ గా దక్కిందని తెలుస్తోంది. నాని క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత దానయ్య (DVV Danayya) 50 కోట్ల రూపాయలు రెండు సినిమాల కోసం నానికి ఆఫర్ చేసినట్టు భోగట్టా.
ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దానయ్య సక్సెస్ రేట్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ (RRR) సక్సెస్ తో దానయ్య పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగింది. నాని ఇప్పటికే డీవీవీ బ్యానర్ లో సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాలో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఎస్.జె.సూర్య (S. J. Suryah) ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.
సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా సరిపోదా శనివారం రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. బలగం వేణు డైరెక్షన్ లో ఒక సినిమాలో, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ లో మరో సినిమాలో నాని నటిస్తున్నారు.