యువ కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohith) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు. శనివారం కన్నుమూసిన నారా రామ్మూర్తి నాయుడు గురించి నారా రోహిత్ ఎక్స్‌లో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘మీరొక ఫైటర్ నాన్నా.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘‘నాన్నా.. మీరే ప్రేమించడం, జీవితాన్ని గెలవడం గురించి నాకు నేర్పించారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరే. ప్రజలను ప్రేమించడంతో పాటు, మంచి కోసం పోరాడాలని కూడా చెప్పారు.
మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు. నాన్నా.. మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు.. బై నాన్నా’’ అని నారా రోహిత్ తన పోస్టులో పేర్కొన్నారు.నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలసిందే. ఆయన పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు.
అక్కడి నుండి స్వస్థలం నారావారిపల్లె తీసుకెళ్లి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామ్మూర్తి నాయుడు 1992 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. టీడీపీ తరఫున 1994లో చంద్రగిరి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2003లో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే 2004లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించడంతో నచ్చక చంద్రగిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో పోరాడి శనివారం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నారా రోహిత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.