నాటకం

ఇటీవలకాలంలో ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ పెంచిన చిత్రాల్లో “నాటకం” ఒకటి. “పటాస్” చిత్రంలో విలన్ గా మెప్పించిన ఆశిష్ గాంధీ కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ జి గోగన దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొరటు సరసం, మితిమీరిన వయొలెన్స్ ల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : బాలకోటేశ్వర్రావు (ఆశిష్ గాంధీ) గుంటూరు జిల్లాలోని చింతలపూడి అనే గ్రామంలో పనీ పాటా లేకుండా తిరుగుతుంటాడు. రోజూ తాగడం, స్నేహితులతో ఊర్లో తిరగడం, మధ్యలో ఊర్లో వాళ్ళకి అప్పుడూ సహాయపడుతుండే కొడుక్కి పెళ్లి చేయాలని చూస్తుంటాడు అతడి తండ్రి. కానీ కుర్రాడు దురుసుతనం తెలిసిన వాళ్ళెవరూ కోటికి తమ పిల్లను ఇవ్వడానికి ఇష్టపడరు. పెళ్లి చేసుకోవడానికే కాదు పెళ్లి చేసుకోవడానికి కూడా పిల్ల దొరకడం లేదని బాధతో తాగేసి తిరుగుతున్న కోటిగాడికి కనిపిస్తుంది పార్వతి (ఆషిమా నర్వాల్). తొలిచూపులోనే ఇద్దరూ ఒకర్నొకరు ప్రేమించేసుకోవడంతో పెద్దగా లేట్ చేయకుండానే “అన్ని” కార్యక్రమాలు కానిచ్చేసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు.

కట్ చేస్తే.. పుల్లూరు అనే గ్రామంలో 72 మందిని ఊచకోత కోసిన ఓ దొంగల ముఠా చింతలపూడి దరిదాపుల్లో తిరుగుతుంటుంది. ఆ గ్యాంగ్ ను పట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీరలేవల్లో ప్రయత్నిస్తుంటారు కానీ.. రిజల్ట్ మాత్రం ఉండదు. అసలు కోటేశ్వర్రావు అలియాస్ కోటి-పార్వతీల ప్రేమ కథకు, ఆ 72 మందిని నరికేసిన దొంగల ముఠాకి సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే మాత్రం “నాటకం” సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : విలన్ టర్నడ్ హీరో ఆశిష్ గాంధీ ఈ చిత్రంలో హీరోగాకంటే నటుడీగా తనను తాను నిరూపించుకొన్నాడు. నాటుగా కనిపించడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలించలేదు కానీ.. నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకొన్నాడు. ఆషిమా నర్వాల్ గ్లామర్ డోస్ సినిమాకి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్. అమ్మడి అందాలు మాస్ ఆడియన్స్ ను, కుర్రకారును అమితంగా ఆకట్టుకొంటాయి. అయితే.. అందాల ప్రదర్శన మరియు శృంగార సన్నివేశాల్లో మొహమాటపడకపోవడంతోపాటు కాస్త ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ కూడా పండించి ఉంటే ఇంకాస్త బాగుండేది. కంట్లో గ్లిజరిన్ కారణంగా వస్తున్న నీళ్ళు చూసి అమ్మాయి ఏడుస్తుంది అని అర్ధం చేసుకోవాలి తప్ప ఆ బాధ తాలూకు భావం అమ్మాయి ముఖంలో భూతద్ధం పెట్టి వెతికినా దొరకదు.

పోలీస్ పాత్రలో నటించిన నటుడు చూడ్డానికి కాస్త దిట్టంగా ఉన్నాడు కానీ.. నటనతో మాత్రం ఆకట్టుకోలేకపోవడమే కాదు కథలో చాలా కీలకమైన పాత్రకు న్యాయం కూడా చేయలేకపోయాడు.

సాంకేతికవర్గం పనితీరు : సాయికీర్తీక్ సినిమాలోని కంటెంట్ తో సంబంధం లేకుండా తన సంగీతంతో సినిమాని కాస్త పైకి లేపడానికి ప్రయత్నించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. చాలా సన్నివేశాల్లో ఎమోషన్ లేకపోయినా సాయికార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ వల్ల ఆ ఎమోషన్ కాస్త ఎలివేట్ అయ్యింది.

అంజి సినిమాటోగ్రఫీ క్వాలిటీ బాగుంది. అయితే.. ఈ తరహా జోనర్ సినిమాకి కావాల్సిన ఫ్రేమ్స్ కానీ యాంగిల్స్ కానీ ఎక్కడా కనిపించలేదు. మణికాంత్ ఎడిటింగ్ వల్ల సినిమా కాస్త బ్రతికింది కానీ.. లేదంటే మధ్యలోనే ప్రేక్షకుడు థియేటర్ నుంచి వెళ్లిపోయేవాడేమో.

దర్శకుడు కళ్యాణ్ జి గోగన రాసుకొన్న కథలో ఉన్న నావెల్టీ, కథనంలో కనిపించదు. క్లైమాక్స్ కి వచ్చాక అనిపిస్తుంది “ఏంటి ఈ సినిమాకి ఇంత మంచి కథ ఉందా?” అని. దర్శకుడు ఆషిమా అందాలను వివిధ భంగిమల్లో చూపించడంపై పెట్టిన శ్రద్ధలో సగమైనా కథనం కాస్త ఆసక్తికరంగా సాగే విధానంపై పెట్టి ఉంటే బాగుండేది. కనీసం కోర్ట్ సీన్ తో సినిమాని ఎండ్ చేసినా “పోన్లే ఏదో ప్రయత్నించారు” అనుకొనేవాళ్లం. కానీ.. ఏడేళ్ళ జైలు శిక్ష తర్వాత కోటి మళ్ళీ ఊరికి వచ్చినట్లు చూపించిన సన్నివేశాలు సినిమాకి ఇంకాస్త కిందకు దిగజార్చాయి.

విశ్లేషణ : హీరోకి గెడ్డం, హీరోయిన్ కి గ్లామర్.. ఇద్దరికీ కొన్ని రోమాంటిక్ సీన్స్ ఉంటే సినిమా హిట్ అవ్వదు. ఆ రొమాన్స్ లో ఫీల్ ఉండాలి, ఆ ఇద్దరి కలయికకి ఒక అర్ధం ఉండాలి. ఆ క్లారిటీ లేనప్పుడు వచ్చే సినిమాలు “నాటకం”లా తయారవుతాయి. సందర్భంలేని శృంగార సన్నివేశాలు చూసి ఆనందించే కొన్ని వర్గాలకు ఈ సినిమా ఏమైనా నచ్చే అవకాశం ఉంది.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus