కొన్నాళ్ల క్రితం ఓ మలయాళ సినిమా రీమేక్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది గుర్తుందా? పెద్ద పెద్ద హీరోల పేర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల పేర్లు చర్చలోకి వచ్చాయి కానీ.. ఆ సినిమా అయితే ముందుకెళ్లలేదు. దీంతో ఆ సినిమా ఇక ఆగినట్లే అని ఫిక్స్ అయ్యారంతా. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు మళ్లీ ఆ సినిమా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అంతా ఓకే అయ్యిందని, తొలుత అనుకున్నదాని కన్నా అదిరిపోయే రీతిలో ఆ సినిమా రీమేక్ చేస్తారు అని చెబుతున్నారు. త్వరలో అధికారికంగా వివరాలు కూడా బయటకు వస్తాయట.
మలయాళంలో గత కొన్నేళ్లలో వచ్చిన థ్రిల్లర్లలో ‘నాయట్టు’ ది బెస్ట్ అని చెప్పొచ్చు. జోజు జార్జ్, కుంచుకో బోబన్ ఇందులో ముఖ్య పాత్రధారులు. వ్యవస్థలో లోపాలను కళ్లకు కట్టేలా ఆ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ సినిమాకు మంచి పేరుతో పాటు వసూళ్లు కూడా వచ్చాయి. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని చాలా రోజుల నుండి వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి సినిమా వచ్చేసేది కూడా. అయితే ఏదో కారణాల వల్ల ఆలస్యమైంది.
ఇప్పుడు సినిమాకు (Nayattu) సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. గతంలో అనుకున్నట్లుగా జోజు జార్జ్ పాత్రలో రావు రమేశ్ నటించడం లేదట. అతని స్థానంలో శ్రీకాంత్‌ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ‘పలాస’ లాంటి హార్డ్ హిట్టింగ్ కథతో అదరగొట్టిన కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘నాయట్టు’ లాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయడం సరైన ఆలోచన కాదని మాటలు వినిపిస్తున్నా.. కరుణ కుమార్ ఆ సినిమాను బాగానే డీల్ చేస్తారని నమ్మి ఇప్పుడు ఓకే చేశారట.
ఇక సినిమాలోని మరో కీలక పాత్ర నిమిష… శివాత్మిక రాజశేఖర్‌కు దక్కిందట. అలాగే కుంచుకో బోబన్ పాత్రను రాహుల్ విజయ్ పోషిస్తున్నాడట. సినిమాలో కీలకమైన లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తోంది అని టాక్. ఇక ఈ సినిమాకు ‘కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.