పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది ఈ సినిమా. ఇందులోని కొన్ని మైనస్ పాయింట్స్ ను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు నెటిజన్లు. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) సినిమా స్టార్టింగ్లోనే ఒక సీన్ ఉంటుంది. ఒక చోట కూలీలుగా కొంతమంది జనాలు పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఒక పిల్లాడికి వజ్రం దొరుకుతుంది. అది తీసుకెళ్లి రాజులకు అప్పగిస్తే..వాళ్ళు మంచి భోజనం పెడతారు. అందుకోసం జనాలు ఆ చిన్న పిల్లాడిని కొట్టి ఆ వజ్రం లాక్కుని తీసుకెళ్లి రాజులకు అప్పగిస్తారు. తర్వాత ఆ పిల్లాడు బాధతో తన తాత దగ్గర ఏడుస్తాడు. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కానీ దీనికి సినిమాలో సరైన ప్రాముఖ్యత లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో ఇంట్రో కోసం వాడుకున్నట్టే ఈ సీన్ ని వాడుకున్నారు.
2) ఔరంగజేబ్(బాబీ డియోల్) పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ బాగుంది. కానీ ఈ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. హీరో- విలన్ మధ్య కాన్ఫ్రన్టేషన్ సీన్స్ ఏమైనా బలంగా పెట్టుంటే బాగుండేవి. అలాంటివి చేయలేదు. క్లైమాక్స్ లో ఇద్దరూ కలిసిన విధానం కూడా ఇద్దరు హీరోలు కలిసినట్టు ఉంటుంది. అది కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్- చరణ్ సీన్లా అనమాట. అక్కడితో సినిమా అవ్వగొట్టేసి సెకండ్ పార్ట్ లో చూసుకుందాం అని సినిమాని ముగించేశారు.
3) నిధి అగర్వాల్ – పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ చాలా బోర్ కొట్టింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద ఆమె పాత్రకు ఏదో ట్విస్ట్ ఇచ్చినట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ కు షిఫ్ట్ అవుతుంది. కానీ సెకండాఫ్ లో ఆ సీన్ కి ఎటువంటి జస్టిఫికేషన్ ఉండదు. హడావిడి హడావిడి గానే నిధి ట్రాక్ ను పక్కకు పెడతారు.
4) ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద పులిని వీరమల్లు కంట్రోల్ చేస్తున్నట్టు ఓ సీన్ ఉంటుంది. అబ్బా అక్కడ హీరో లుక్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఈ సీక్వెన్స్ మొత్తం సోషల్ మీడియా బ్యాచ్ కి మంచి ట్రోలింగ్ స్టఫ్ గా మారే అవకాశం లేకపోలేదు.
5) పవన్ కళ్యాణ్ లుక్స్ ఒక్కో సీన్లో ఒక్కోలా ఉంటాయి. ఒక సీన్ లో గడ్డం ఉంటుంది. మరో సీన్లో క్లీన్ షేవ్ తో కనిపిస్తాడు. దీని వల్ల కంటిన్యుటీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు జ్యోతి కృష్ణ అప్పటికీ.. అప్పుడు.. ఇప్పుడు స్లైడ్స్ వేసి కవర్ చేసే ప్రయత్నం చేశాడు కానీ.. అది వర్కౌట్ అవ్వలేదు.
6) సుబ్బరాజు, సునీల్, నాజర్, రఘుబాబు..ల కామెడీ సీన్స్ పూర్తిగా తేలిపోయాయి. సపోర్టింగ్ రోల్స్ గా కూడా ఈ పాత్రలు మెప్పించలేదు. పైగా ఔట్ డేటెడ్ అనే ఫీలింగ్ కలిగిస్తాయి.
7) వి.ఎఫ్.ఎక్స్ ఈ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. చాలా సీన్స్ లో అవి మరీ నాసిరకం అనే ఫీలింగ్ కలిగిస్తాయి. హడావిడి సినిమాని కంప్లీట్ చేసి వదిలించుకోవాలనుకుని.. వీటిపై శ్రద్ధ పెట్టలేదేమో అనుకోవాలి.
8) ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు నటించారు. కానీ చాలా మంది ఆయన పాత్రని గుర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయన పాత్రకు డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు. చివరి రోజుల్లో కోటా మంచానికే పరిమితమయ్యారు. బహుశా డబ్బింగ్ కోసం ఆయన కదిలి రాలేకపోయారనుకుంట. పోనీ ఏఐ సాయంతో అయినా ఆయన వాయిస్ ను రీ- క్రియేట్ చేసే ప్రయత్నం చేయలేదు.
9) నిర్మాత ఈ సినిమాకు రూ.250 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పూర్ గా ఉన్నాయి. ఒకే చోట 2,3 సీన్లు తీసేశారు. 5 ఏళ్ళ పాటు సెట్స్ పై ఉన్న సినిమా కాబట్టి బడ్జెట్ అంతా ఇంట్రెస్ట్..ల రూపంలోనే పోయింది అనుకోవాలి.
10) సెకండ్ పార్ట్ కు ఇచ్చిన లీడ్ కూడా ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. అసలు 2 పార్టులుగా తీసేంత విషయం కూడా సినిమాలో లేదు అనే చెప్పాలి. చివర్లో బాబీ డియోల్ తో ఒక ఫైట్ పెట్టేసి.. ఒక పార్ట్ గా సినిమాని ముగించేసే అవకాశం కూడా ఉంది. మహా ఉంటే మరో 10 నిమిషాలు రన్ టైం పెరిగేది. ఇది మొదటి భాగంగా ప్రమోట్ చేసుకోవడం కూడా పెద్ద మైనస్ అనే చెప్పాలి.
11) క్రిష్ ఈ చిత్రాన్ని 80 శాతం కంప్లీట్ చేశారు. కానీ ఎక్కడా కూడా క్రిష్ ఫ్లేవర్ కనిపించలేదు. ఆయన ప్లాప్ సినిమాలకి కూడా ఓ మర్యాద ఉంటుంది. ‘హరిహర వీరమల్లు’ విషయంలో అది దక్కడం కష్టమే. జ్యోతి కృష్ణ చేసిన మార్పులు కూడా సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయనే చెప్పాలి. మంచి పాయింట్ తీసుకున్నా.. జ్యోతి కృష్ణ డైరెక్షన్ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి.