మొన్నీమధ్యనే ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నెపో హీరోల గురించి చురకలు అంటించాడు. ఆ మాటలు మిస్ ఫైర్ అయి విజయ్‌కి చురకలు అంటాయి అనుకోండి. ఇప్పుడు మరోసారి వారసత్వం గురించి మాట్లాడి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. తన కొత్త సినిమా ‘కింగ్డమ్’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో నెపో విమర్శలు రావడం మొదలయ్యాయి.
ఆనంద్ దేవరకొండ తన సోదరుడు విజయ్ దేవరకొండను చూసే సినిమాల్లోకి వచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అతని కోసం విజయ్ సినిమా ప్రచారాలు చేస్తాడు అనేది తెలిసిన విషయమే. అయితే ఆనంద్ సినిమాల విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వను అని విజయ్ దేవరకొండ అంటున్నాడు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో తన కుమారుడు సినిమాల్లోకి వచ్చినా ఇలాగే ఉంటానని చెప్పాడు. అంటే తన కొడుకుని సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు అని అర్థమవుతోంది.
నటుడిగా ప్రయాణం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే ఆనంద్ సినిమాల్లోకి వస్తున్నా అని చెబితే.. ఇతర విషయాలను పట్టించుకోకుండా, నీపై నీకు నమ్మకం ఉంటేనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టు, లేదంటే వద్దు అని చెప్పేశా. ప్రారంభంలో కొంత కష్టమైనప్పటికీ ఇప్పుడు తనదైన శైలి కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు అని తన తమ్ముడి విషయంలో తన విధానం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు విజయ్.
ఇదంతా విన్నాక విజయ్ ఇన్నాళ్లూ చేస్తున్న నెపో కామెంట్స్.. ఇప్పుడు ఆయనకు రిటర్న్ అవుతున్నాయి. ఎందుకంటే నెపో కిడ్స్, వాళ్ల కథల ఎంపిక, సినిమాల విషయంలో వారి తండ్రి ప్రమేయం లాంటి కామెంట్లు గతంలో విజయ్ నోట వచ్చాయి. ఇంట్లో ఇప్పటికే ఓ నెపో హీరోను పెట్టుకుని.. ఇంకో ఇంట్లోని వారసుల మీద కామెంట్ చేస్తావా అని కొన్ని రోజుల క్రితం విజయ్ మీద కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు విజయ్ మాటలు వింటుంటే వాటికి కౌంటర్‌లా ఉంది.