ఇదివరకు సినిమాలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్. కానీ.. మెల్లమెల్లగా సినిమాల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి ఆన్ లైన్ వెబ్ సిరీస్ లు. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, జీ5, వి.ఐ.యు, వూట్, హోయ్ చాయ్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో పలు వైవిధ్యమైన వెబ్ సిరీస్ లు జనాలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. తెలుగులో మాత్రం ఈ వెబ్ సిరీస్ హంగామా రీసెంట్ గా మొదలైంది. ఇటీవలే జీ5లో వచ్చిన “కైలాసపురం” ఏస్థాయి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సిరీస్ అనంతరం జీ5 ప్రొడ్యూస్ చేసిన సరికొత్త బోల్డ్ & యూత్ ఫుల్ వెబ్ సిరీస్ “నెర్డ్“. దేవ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ మిస్టరీ థ్రిల్లర్ కావడం విశేషం. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఏమేరకు ఆకట్టుకొంది అనేది చూద్దాం..!!
కథ: హశ్వంత్ (హశ్వంత్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అనాధ కావడంతో స్వేచ్ఛగా బ్రతకడం అలవాటైపోతుంది. తనకు స్నేహితులు లేరని బాధపడుతున్న హశ్వంత్ లైఫ్ లోకి రకరకాలుగా ఆరుగురు అమ్మాయిలు వస్తారు. యోగా సెంటర్లో ఒకరు, ఆఫీస్ కి వచ్చే క్యాబ్ లో ఒకరు, ఆఫీస్లో ఇంకొకరు, కర్రీ పాయింట్ దగ్గర ఒకరు, జిమ్ లో మరో అమ్మాయి.. ఇలా మొత్తం ఆరుగురు అమ్మాయిలు హశ్వంత్ కి పరిచయమవుతారు. అందరితోనూ హశ్వంత్ సన్నిహితంగానే మెలుగుతుంటాడు. కానీ.. ఉన్నట్లుండి ఈ ఆరుగురు అమ్మాయిలూ.. ఒక్కొక్కరూ కనిపించకుండా మాయమవుతుంటారు. ఈ ఆరుగురికి కామన్ ఫ్రెండ్ అయిన హశ్వంత్ ను అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ ఆరుగురు అమ్మాయిలు ఏమైయ్యారు? హశ్వంత్ ఎందుకు ఈ ఆరుగురితో రిలేషన్ మెయిన్టైన్ చేశాడు? కథలో అసలు ట్విస్ట్ ఏమిటి? అనేది తెలియాలంటే.. ఈ ఏడు ఎపిసోడ్ల “నెర్డ్” సిరీస్ ను తప్పకుండా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: నటన పట్ల ఎలాంటి పూర్వ అనుభవం లేకపోయినా.. హశ్వంత్ టైటిల్ పాత్రలో ఒదిగిపోయాడు. నవతరం కుర్రాళ్ళకు ఈ క్యారెక్టర్ కాస్త గట్టిగానే రిలేట్ అవుతుంది. ముఖ్యంగా.. క్యారెక్టరైజేషన్ మరియు దాని ట్విస్ట్ ఈ జనరేషన్ కి చాలా రిలేటబుల్ గా ఉండడం విశేషం. అలాగే.. ఆ క్యారెక్టర్లో వేరియేషన్స్ & సెన్సిబుల్ ఎమోషన్స్ ను బాగా పలికించి సిరీస్ కి మెయిన్ హైలైట్ అయ్యాడు హశ్వంత్.
ఆరుగురు అమ్మాయిల్లో రహస్య పాత్రలో నమ్రత ఎక్కువ మార్కులు కొట్టేసింది. మిగతా అమ్మాయిలు గెహనా వశిష్ట్, నికిత, ఆర్తి, నిషత్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ సిరీస్ కి కాస్త సీరియస్ నెస్ తోపాటు ఫన్ కూడా యాడ్ చేశాడు.
సాంకేతికవర్గం పనితీరు: మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ ఆర్కే, సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ లకు మెయిన్ క్రెడిట్ ఇవ్వాలి. ఒకరు నేపధ్య సంగీతంతో ఇంటెన్సిటీని యాడ్ చేస్తే.. మరొకరు కెమెరా వర్క్ & ఫ్రేమింగ్స్ తో వ్యూయర్స్ ని ల్యాప్టాప్ /మొబైల్ స్క్రీన్స్ కి కట్టిపడేశాడు.
ప్రొడక్షన్ వేల్యూస్ & ఆర్ట్ వర్క్ సెరీస్ కి ఒక అథెంటిసిటీని యాడ్ చేశాయి.
దర్శకుడు దేవగణేష్ “నెర్డ్” కథను రాసుకున్న విధానం, ఆ కథను తెరకెక్కించిన తీరు బాగున్నాయి. ముఖ్యంగా లీనియర్ స్క్రీన్ ప్లేతో సిరీస్ ను నడిపించడం వలన ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. కథలో వచ్చే ఎవ్వరూ ఊహించలేని ట్విస్టులు సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే.. మూలకథను వైవిధ్యమైన మలుపులు తిప్పిన విధానం, కథలో ప్రెజంట్ జనరేషన్ కుర్రాళ్ళు ఎక్కువగా భయపడే, భయపడుతున్న విషయాన్ని జొప్పించడం వలన.. సదరు ఆడియన్స్ ఈ సిరీస్ కి బాగా కనెక్ట్ అవుతారు. కొన్ని సందర్భాల్లో ఇది నిజమే కదా అనిపిస్తుంది. అలాగే.. సొసైటీ ఒక మనిషి పట్ల ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంది, ఆ సొసైటీ మరియు జనాల కారణంగా కొందరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి రుగ్మతుల పాలవుతున్నారు అనేది చాలా ఎమోషనల్ గా చెప్పాడు దేవ గణేష్. సిరీస్ ని కాస్త ఇంట్రెస్టింగ్ గా నడిపించడం కోసం మరియు యూత్ కనెక్ట్ అవ్వడం కోసం కొన్ని రొమాంటిక్ సీన్స్ యాడ్ చేసినప్పటికీ.. వాటిలో అసభ్యత లేకుండా జాగ్రత్తపడ్డాడు. అన్ని శృంగార సన్నివేశాలు సెన్సిబుల్ గానే ఉన్నాయి.. శృతి మించలేదు, ఇబ్బందికరంగానూ లేవు.
విశ్లేషణ: మన దైనందిన జీవితంలో ఉన్న టెన్షన్స్ వల్ల వర్క్ ప్రెజర్స్ వల్ల మనకి వచ్చే రుగ్మతుల కారణంగా సమాజం మనల్ని చిన్న చూపు చూడడం అనేది కామన్ అయిపోయింది. కానీ.. ఆ చిన్నచూపు కారణంగా ఒక మనిషి ఎలాంటి ఇబ్బందికి లోనవుతున్నాడు? ఒక మనిషిలోని మృగాన్ని ఈ సమాజం ఎలా తట్టి లేపుతుంది? అనేది చాలా డీసెంట్ గా చూపించిన సిరీస్ “నెర్డ్”. ఒక రెండు ఎపిసోడ్స్ వరకూ కథలో ఇన్వాల్వ్ అవ్వలేక కాస్త ఇబ్బందిపడినా.. మూడో ఎపిసోడ్ నుండీ విశేషమైన రీతిలో ఎంగేజ్ చేస్తుంది.
రేటింగ్: ఇది ఒక మంచి ప్రయత్నం, రేటింగులతో వారి కష్టాన్ని బేరీజు వేయదలుచుకోలేదు.