ఇండియన్ వెబ్ సిరీస్ లు కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి అని ప్రూవ్ చేసిన సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్”. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, షరీబ్ హష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ కి భీభత్సమైన క్రేజ్ ఏర్పడి.. ఏకంగా ఇప్పుడు మూడో సీజన్ విడుదలయ్యేలా చేసింది. ఇండియన్ స్పై థ్రిల్లింగ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ కి రాజ్ & DK దర్శకత్వం వహించడమే కాక నిర్మించారు కూడా. మరి ఈ మూడో సీజన్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: అందరి ఫేవరెట్ స్పెషల్ ఏజెంట్ శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్ పాయ్) తన సీనియర్ తో కలిసి నాగాల్యాండ్ ఒక సీక్రెట్ మిషన్ కోసం వెళ్తాడు. అక్కడ తన సీనియర్ కులకర్ణిని దారుణంగా హతమారుస్తారు కొందరు మెర్సనరీలు.
వాళ్లెవరూ అనేది గుర్తించి, వాళ్లని పట్టుకోవడం కోసం శ్రీకాంత్ తివారీ కొత్త ఆపరేషన్ మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఇండియన్ గవర్నమెంట్ అతడ్ని ఎందుకు అనుమానిస్తుంది? ఈ సమస్యల నుండి శ్రీకాంత్ ఎలా బయటపడ్డాడు? తన నిజాయితీని నిరూపించుకున్నాడా? అనేది సీజన్ 3 కథాంశం.

నటీనటుల పనితీరు: శ్రీకాంత్ తివారి క్యారెక్టర్ ను మనోజ్ బాజ్ పాయ్ బాగా ఓన్ చేసుకున్నాడు. అందువల్ల ఆయన నటిస్తున్నట్లుగా కాక, బిహేవ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ సీజన్ లో యాక్షన్, కామెడీతోపాటు సెంటిమెంట్ & ఎమోషన్ కూడా బాగా పండించాడు.
ప్రియమణికి ఈ సీజన్ లో కాస్త ఎక్కువ సీన్లు పడ్డాయి. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ & యాక్టింగ్ తో ఆకట్టుకుంది. శ్రేయా ధనవర్తి ఫస్ట్ సీజన్ తర్వాత మళ్లీ మూడో సీజన్ లో దర్శనమిచ్చింది. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ప్రాధాన్యత మాత్రం బాగుంది.
జైదీప్ అలావత్ రెగ్యులర్ విలన్ రోల్ అయినప్పటికీ.. క్యారెక్టరైజేషన్ తో ఆ నెగిటివ్ రోల్ ని నెట్టుకొచ్చాడు. అతడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ & డైలాగ్స్ బాగా పేలాయి.
ఇక రాగ్ మయూర్, విజయ్ సేతుపతిల క్యామియోలు మంచి ఫన్ యాడ్ చేశాయి.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, కలరింగ్, టోన్ వంటి విషయాల్లో టీమ్ తీసుకున్న కేర్ ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో కీరోల్ ప్లే చేసింది. 7 ఎపిసోడ్ల సిరీస్ లో ప్రొడక్షన్ పరంగా ఒక్క తప్పు కూడా దొర్లలేదు అంటే మామూలు విషయం కాదు. యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఇంకాస్త పర్టిక్యులర్ గా, స్టైలిష్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద ఫైట్లు కూడా సింపుల్ గా అయిపోయింది అనిపిస్తాయి.
దర్శక ద్వయం రాజ్ & DK.. మొదటి రెండు సీజన్లలో మనోజ్ బాజ్ పాయ్ టైమింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు. మూడో సీజన్ లో మాత్రం ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్తున్నాం అనే ఉద్దేశ్యంతో మనోజ్ ను కాస్త సీరియస్ గా చూపించారు. కామెడీ బాధ్యత మొత్తం షరీబ్ హష్మీ మీద వేసేశారు. అది పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఈ తరహా ఇంటర్న్షనల్ కాన్స్పిరసీ ఉన్న సిరీస్ & సినిమాలు ఇప్పటికే చాలా చూసేసి ఉండడంతో.. ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్న భావన కలగలేదు.
ఫ్యామిలీ మ్యాన్ కి ప్లస్ పాయింటే.. డీల్ చేసే పాయింట్. మొదటి సీజన్ ముంబైలో గ్యాస్ బ్లాస్ట్, సెకండ్ సీజన్ ప్రధానమంత్రి మీద అటాక్ ను ఆపడం.. ఈ రెండు ఇండియా లింక్ ఉండడం, కాస్త తమిళ ఫ్లేవర్ కూడా ఉండడంతో ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. కానీ.. సీజన్ 3 లో అది మిస్ అయ్యింది. రాజ్ & డీకే నేల విడిచి సాము చేయకుండా ఉండాల్సింది.

విశ్లేషణ: ఇప్పుడు ఇంటర్నేషనల్ ఓటీటీల పుణ్యమా అని.. రకరకాల కంటెంట్ చూస్తున్నారు ఆడియన్స్. అందువల్ల.. మనం కొత్తగా ఇంటర్నేషనల్ లెవల్లో కంటెంట్ ఇవ్వాలని ప్రయత్నించి చేతులు కాల్చుకోనక్కర్లేదు. దేశీ కథలనే అత్యుత్తమ స్థాయిలో చెప్పి ప్రేక్షకుల్ని రంజింపజేయవచ్చు. ఈమధ్యకాలంలో హిట్టైన సినిమాలు కూడా అదే బాటను ఫాలో అయ్యాయి. సో, రాజ్ & డీకేలు కష్టపడి బిల్డ్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజ్ ను ఎక్కడికో తీసుకెళ్లకుండా.. ఇండియన్ స్టోరీలా చూపిస్తేనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
మరీ ముఖ్యంగా ఒక సిరీస్ ను ఒక సీజన్ లో సుఖాంతం చేయండయ్యా.. వచ్చే సీజన్ వరకు ఏం జరిగిందా అని వెయిట్ చేయడం అనేది చిరాగ్గా ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్ మునుపటి రెండు సీజన్లు అలా హుందాగా ముగించినవే. ఈ సీజన్ 3 విషయంలోనే సీజన్ 4 వరకు వెయిట్ చేయండి అంటూ చాలా ప్రశ్నలకు జవాబు లేకుండా వదిలేశారు. అది ఎప్పడు వస్తుందో తెలియక, ఏం జరిగిందో తెలుసుకోలేక ప్రేక్షకులు నిరాశ చెందడం ఖాయం.

ఫోకస్ పాయింట్: రేంజ్ పెరిగింది కానీ.. ఇంపాక్ట్ తగ్గింది!
రేటింగ్: 2.5/5
