టాలీవుడ్ లో ఉన్న అగ్ర సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన సుకుమార్ సినిమాలకు తప్ప మిగిలిన వాటికి ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి సంక్రాంతి రూపంలో పెద్ద పరీక్షే ఎదురైంది. దేవికి కాంపిటీటర్ అయిన తమన్ ఒకేసారి ‘వీరసింహారెడ్డి’, ‘వారసుడు’ సినిమాలతో రంగంలోకి దిగగా.. దేవి ‘వాల్తేర్ వీరయ్య’తో పోటీకి దిగారు. దేవిపై పెద్దగా అంచనాలు లేకపోవడం అతడికి ప్లస్ అయిందనే చెప్పాలి.
సినిమాలో మొత్తం ఐదు పాటలకు కలిపి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మరోసారి ఆడియన్స్ లో తనకెంత పట్టుందో నిరూపించారు దేవిశ్రీప్రసాద్. ‘బాస్ పార్టీ’ సాంగ్ ఒక్కదానికే 51 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘పూనకాలు లోడింగ్’కి 19 మిలియన్ల, ‘శ్రీదేవి చిరంజీవి’ పాటకు 13 మిలియన్లు, టైటిల్ సాంగ్ కి 9.4 మిలియన్లు, ‘నీకేమో అందమెక్కువ’ సాంగ్ కి 9.1 మిలియన్ వ్యూస్ దక్కాయి. ‘పుష్ప1’ తరువాత ఆ స్థాయిలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సైతం ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే దక్కాయి. ఇదే జోష్ ని కంటిన్యూ చేయనున్నారు దేవిశ్రీప్రసాద్. ఆయన నెక్స్ట్ సినిమా ‘పుష్ప2’ కోసం ఫస్ట్ పార్ట్ ని మించేలా ట్యూన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు దేవి. ఫ్యాన్స్ లో కూడా అంచనాలు బాగా పెరిగిపోయాయి. ‘పుష్ప’ పార్ట్ 1లో ‘ఊ అంటావా’ సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ‘సామీ సామీ’ కూడా బాగా క్లిక్ అయింది.
ఇప్పుడు ఆ పాటలను మైమరిపించే విధంగా ట్యూన్స్ ను కంపోజ్ చేయాల్సి ఉంటుంది. ‘పుష్ప2’ ఆల్బమ్ గనుక క్లిక్ అయితే దేవి కెరీర్ ఊపందుకోవడం ఖాయం. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇది ఒక్కటే. దర్శకుడు బాబీ ఓ పెద్ద ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది ఒకే అయితే అందులో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిని తీసుకుంటారు.