పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాలు ఫుల్ మాస్‌గా ఉంటాయి, హీరోలు రగ్‌డ్‌గా ఉంటారు. సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతున్నట్లే ఉంటుంది. అయితే హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. సినిమాలో కీలక సన్నివేశాల్లో, మలుపుల్లో హీరోయిన్ కీలకంగా ఉంటూ వస్తుంది. గత సినిమాల్లో ఈ విషయాన్ని మనం పరిశీలించొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అలాంటి పాత్ర కోసం పూరి తన నెక్స్ట్ సినిమాలో ఓ సోషల్ మీడియా స్టార్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను తీసుకున్నారు అని వార్తలు వస్తుండటమే. ఆమెనే నిహారిక్ ఎన్.ఎం.
నిహారిక తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమే. తెలుగు సినిమాలను తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఉంటుంది. సినిమా టీమ్స్ ఆమెతో టై అప్ అయ్యి ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు ఆమె నటి అయింది కూడా. ‘పెరసు’ (Perusu) అనే తమిళ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చింది అని అంటున్నారు. అన్నీ ఓకే అయితే విజయ్ సేతుపతి నెక్స్ట్ మూవీ ‘బెగ్గర్’ (రూమర్డ్ టైటిల్)లో హీరోయిన్‌గా ఆమెనే నటిస్తుంది అని అంటున్నారు.
పూరి – సేతుపతి (Vijay Sethupathi) సినిమాలో హీరోయిన్‌గా రాధికా ఆప్టే (Radhika Apte) నటిస్తుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఆమె ఓకే అవ్వలేదని, స్క్రీన్ టెస్ట్‌లో నిహారిక ఎన్.ఎం (Niharika NM) ఓకే అయిందని సమాచారం. ‘పెరుసు’ సినిమాలో ఆమె నటనను చూసే పిలిచారు అని చెబుతున్నారు. ఇక నిహారిక సంగతి చూస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో 35 మిలియన్లకుపైగా ఫాలోవర్లున్నారు. అక్కడ వీడియోలతో చాలా పాపులర్ ఆమె. ఇక పైన చెప్పినట్లు ‘మేజర్’ (Major), ‘లైగర్’ (Liger) సహా కొన్ని పెద్ద సినిమాలకు ప్రచారం చేసింది.
అయితే పూరి – సేతుపతి సినిమా తెలుగులో ఆమెకు తొలి సినిమా కాదు. గీతా ఆర్ట్స్‌లో ఇప్పటికే ఆమె (Niharika NM) ఓ సినిమాను సైన్ చేసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో ఆ సినిమా తెరకెక్కుతుంది అని సమాచారం.