మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక చేసిన తొలి చిత్రం “ఒక మనసు”. ఈ సినిమా ఆర్ధికంగా విజయం సాధించకపోయినప్పటికీ నిహారిక మంచి మార్కులు కొట్టేసింది. అలాగే “ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్” చిత్రంతో కోలీవుడ్ లోను అడుగుపెట్టి మెగా వారసురాలు అనిపించుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్ లను వదలని ఈమె మంచి నటిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మెగా హీరోల గురించి కామెంట్స్ చేసింది. ఎవరెవరి నుంచి ఏం నేర్చుకుందో వివరించింది. “మంచి రిజల్ట్ రావాలంటే హార్డ్ వర్క్ చేయవలసిందేననే విషయం చిరంజీవిగారి నుంచి తెలుసుకున్నాను.
ఇక ఎలాంటి సమస్యనైనా ఒక చిరునవ్వుతో తరిమేయవచ్చనేది నాన్న నుంచి నేర్చుకున్నాను. యాక్టివ్ గా .. చైతన్యంతో ఉండటం పవన్ కల్యాణ్ నుంచి తెలుసుకున్నాను. ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యతను ఇవ్వడమనేది చరణ్ నుంచి .. కోపం ఎప్పుడు ఎక్కడ చూపించాలనే విషయాన్ని వరుణ్ తేజ్ నుంచి నేర్చుకున్నాను. మనకంటే చిన్నవాళ్లను ఎలా చూసుకోవాలనేది సాయిధరమ్ తేజ్ నుంచి… అంకితభావం అనేది అల్లు అర్జున్ ను చూసి తెలుసుకున్నాను. సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉండాలనేది శిరీశ్ ను చూసి తెలుసుకున్నా” అని ఒక్కరిని కూడా వదలకుండా నిహారిక చెప్పింది. ఆమె మాటలు కుటుంబ సభ్యులకు, మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.