నేను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానిని అని బలంగా చెప్పుకొనే హీరోల్లో ముందు వరసలో ఉండే వ్యక్తి నితిన్ (Nithiin). తన ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండేలా చూసుకునే నితిన్, ఏకంగా పవన్ కళ్యాణ్ పాపులర్ టైటిల్ “తమ్ముడు”తో (Thammudu) సినిమానే చేస్తున్నాడు. అలాంటి నితిన్ తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీగా నిలుస్తున్నాడు. విషయం ఏంటంటే.. నితిన్ హీరోగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రూపొందిన “రాబిన్ హుడ్” (Robinhood) మార్చి 28 విడుదలకి సిద్ధమైంది.
నిజానికి “రాబిన్ హుడ్” గత ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలవ్వాల్సిన సినిమా. కానీ.. “పుష్ప 2” (Pushpa 2: The Rule) ఫీవర్ ముందు ఈ సినిమా థియేటర్లలో నిలువలేదు అని గ్రహించిన మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని పోస్ట్ పోన్ చేసారు. ఆ తర్వాత సంక్రాంతి బరిలో దింపుతారు అని టాక్ వినిపించినప్పటికీ.. అది అవ్వలేదు. అదే విధంగా ఫిబ్రవరి రిలీజ్ అనుకున్నా.. అప్పటికే చాలా సినిమాలు ఎనౌన్స్ చేసి ఉండడంతో.. ఎట్టకేలకు మార్చి 28 విడుదల అని ప్రకటించారు.
అయితే.. అదే తేదీకి పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు” (Hari Hara Veera Mallu) కూడా రిలీజ్ డేట్ ప్రకటించి ఉండడంతో.. ఇప్పుడు ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా లేక నితిన్ నిజంగానే పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలుస్తున్నాడా అనేది చర్చనీయాంశం అయ్యింది. అదే మార్చి 28కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) “VD12” కూడా ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఆ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు.