యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. తమ హీరో ఎంత కష్టపడి నటించినా ఒకరు కూడా అవార్డ్ ఇవ్వనందుకు కోపం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జరిగిన మా సినీ అవార్డ్స్, నిన్న జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్ ప్రదానోత్సవంలో ప్రభాస్ పేరు వినిపించక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి(శివుడు) గా ద్విపాత్రాభినయం చేసి సినిమాను తన భుజం పై తీసుకెళ్లిన ప్రభాస్ ని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం అతనికి జేజేలు పలికినా అవార్డులు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
2016 మా సినీ అవార్డ్స్ లో బాహుబలి సినిమాకు వివిధ కేటగిరీల్లో 13 అవార్డులు వచ్చాయి. 2016 ఫిలిం ఫేర్ అవార్డ్స్ (సౌత్) వేడుకలో బాహుబలి ఐదు అవార్డులను కైవశం చేసుకుంది. వీటిలో ఒకటి కూడా ప్రభాస్ చెంతకు చేరలేదు. ఫిలిం ఫేర్ అవార్డ్స్ జూరీ సభ్యులకు ప్రభాస్ ని అవమానపరచడం ఇప్పుడు కొత్తేమి కాదని ఆయన అభిమానులు విమర్శించారు. వర్షం (2004), చత్రపతి (2005), ఏక్ నిరంజన్ (2009), మిస్టర్ ఫర్ ఫెక్ట్ (2011), మిర్చి (2013), బాహుబలి (2015)..
సినిమాలకు ఉత్తమ నటుడిగా ప్రభాస్ నామినేట్ అయినా చివరకు పక్కన పెట్టారని ఆరోపించారు. 2003 నుంచి 2016 వరకు 11 సార్లు అవార్డు వేడుకలు నిర్వహించిన మా టెలివిజన్ వారు కూడా ప్రభాస్ నటనకు గుర్తింపు ఇవ్వలేదని చెప్పారు. తనకి రాక పోయిన టీం కి అవార్డ్ లు వస్తున్నందుకు ప్రభాస్ సంతోషంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని అభిమానులకు ప్రభాస్ సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ లో నిమగ్నమై ఉన్నారు.