సినిమా కోసం మేం ఎక్కువ బడ్జెట్ పెట్టేశాం, సినిమా భారీగా రావడానికి ఎక్కువ ఖర్చు చేసేశాం, ప్రేక్షకులకు మంచి అనుభూతినివ్వడానికి అనుకున్నదాని కంటే ఎక్కువే అయింది లాంటి మాటలు మనం సినిమా పరిశ్రమలో వింటూనే ఉంటాం. ఆ మాటల తర్వాత మెల్లగా అందుకే సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నాం. మాది పెద్ద సినిమా కదా.. ఆ మాత్రం పెంచుతాం. ఆసక్తి ఉన్నవారే ఎక్కువ పెట్టి కొని సినిమా చూస్తారు లాంటివి అంటారు. అయితే కొందరు మాత్రం సాధారణ టికెట్ ధరలకే మా సినిమాను ప్రేక్షకులు చూడొచ్చు అని చెబుతుంటారు.
ఇప్పుడు ‘మిరాయ్’ టీమ్ రెండో రకం మాట చెబుతోంది.
ఒక తల్లి సంకల్పం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ సంకల్పం ఏమిటనేది తెరపైనే చూడాలి. ‘మిరాయ్’ కథ, విజువల్స్, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. సినిమా అంతే నాణ్యతతో వచ్చింది. ఈ సినిమా చూస్తే రూ.300 కోట్లు ఖర్చు పెట్టి తీసిన అనుభూతి కచ్చితంగా కలుగుతుంది. అందుకే మాకు అవకాశం ఉన్నప్పటికీ టిక్కెట్ ధరల్ని పెంచడం లేదు అని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. అలాగే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మా సినిమా చూడాలన్నదే మా ధ్యేయం అని చెప్పారు.
‘మిరాయ్’లో లార్జర్ దేన్ లైఫ్ సీక్వెన్స్‌లు పది ఉంటాయి. అశోకుడు జ్ఞానాన్ని తొమ్మిది పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడు. వాటి రక్షణ బాధ్యతను ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఓ పుస్తకాన్ని ఆశ్రమానికి అందిస్తాడు. వాటి గురించి హీరో (తేజ సజ్జా) – విలన్ (మంచు మనోజ్) మధ్య పోరాటం ఎలా సాగిందనేది సినిమాలో ఆసక్తికంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. ఈ సినిమా ఈ నెల 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా టీమ్ అన్ని ఇండస్ట్రీలో ప్రచారం షురూ చేసింది.
ఫైనల్‌గా ఒక్కమాట.. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తరహాలో చాలామంది నిర్మాతలు ఆలోచిస్తే అనవసరపు టికెట్ల పెంపు సమస్య టాలీవుడ్‌లో రాదు.