జూన్ 1 నుంచి థియేటర్లు స్ట్రైక్ మొదలవ్వనుంది, సింగిల్ స్క్రీన్స్ ను థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు మోయనున్నారు అంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దాంతో జూన్ మొదటివారం నుండి విడుదలవుతున్న సినిమాల పరిస్థితి ఏమిటి అనే మీమాంస మొదలైంది. అయితే.. స్ట్రైక్ లేనట్లేనని తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ప్రస్తుతం లైన్ లో ఉన్న సినిమాల రిలీజ్ లు మరియు గత రెండు రోజులుగా ఫిలిం ఛాంబర్ లో బడా నిర్మాతలందరూ కూర్చుని చర్చలు జరపడంతో ఈ థియేటర్ స్ట్రైక్ ఓ కొలిక్కి వచ్చినట్లేనని తెలుస్తోంది.
అయితే.. అసలు ఈ థియేట్రికల్ స్ట్రైక్ అనేది మొదలైందే థియేటర్ ఓనర్లకు లేదా డిస్ట్రిబ్యూటర్లకు సరైన లాభాలు రావడం లేదని, థియేటర్ రెంటల్ పద్ధతిని మార్చాలని, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదని. అయితే.. ఈ మీటింగుల్లో సురేష్ బాబు (D. Suresh Babu) ఎన్నడూ లేని విధంగా సీరియస్ అవ్వడమే కాక, థియేటర్లు క్లోజ్ చేయడం అనేది డెసిషన్ మీద విరుచుకుపడ్డారట. దాంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా షాక్ అయ్యారట. వెంటనే థియేటర్ స్ట్రైక్ అనే ఆలోచనకు స్వస్తిపలికారని తెలుస్తోంది.
అయితే.. సమస్యను వాళ్లు వెల్లడించిన విధానం, సమయం తప్పు అయినప్పటికీ.. సమస్య మాత్రం నిజమే. థియేటర్ ఓనర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు సరైన లాభాలు అటుంచితే.. కనీసం మెయింటైనెన్స్ కూడా మిగలడం లేదట. పరిస్థితి ఇలానే కొనసాగితే థియేటర్లు అమ్మేసుకుని మాల్స్ లేదా పెండ్లి మండపాలు కట్టుకోవడం బెటర్ అని భావించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆల్రెడీ థియేటరికల్ బిజినెస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఈ ఎకో సిస్టంలో మార్పు కోసం బడా నిర్మాతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటారు, ఎటువంటి మార్పులు తీసుకొస్తారు అనేది చూడాలి.