కెరీర్ మంచి జోష్‌లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు మన హీరోలు. అంటే మంచి ఫామ్‌లో ఉండి, భారీ స్కోర్లు చేస్తున్న బ్యాటర్లు డిఫరెంట్ షాట్లు బాదినట్లు అన్నమాట. అయితే ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నప్పుడు బ్యాటర్లు కానీ హీరోలు కానీ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు. అయితే హీరోలందరూ ఒకలా ఉండరు అని గత కొన్నేళ్లుగా నిరూపిస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే తన తర్వాతి సినిమాలో పాటలు ఉండవు అని చెబుతున్నారు.
విజయ్ లేటెస్ట్ సినిమా ‘ఫ్యామిలీస్టార్’ (The Family Star) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్‌ను అలా ఎలా చూపిస్తారు, పాత్ర చిత్రణ సరిగ్గా లేకపోవడం వల్లే ఆ సినిమా ఫలితం అలా ఉంది అంటూ దుమారం రేగుతోంది. ఈ చర్చంతా సాగుతున్న సమయంలోనే కొత్త సినిమా గురించి ముచ్చట మొదలైంది. గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవలే ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసేశాడు కూడా.
మే తొలి వారం నుండి విశాఖపట్నంలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తారట. ఈ క్రమంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ పుకార్లు నిజమైతే ఈ సినిమాలో పాటలు ఉండవని సమాచారం. కేవలం థీమ్ మ్యూజిక్‌తోనే సినిమాను రన్ చేస్తారట. గతంలో ‘ఖైదీ’ (Kaithi) సినిమా కూడా ఇలా పాటల్లేకుండానే చేశారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పోషిస్తున్న పాత్ర, సినిమా కథనం ప్రత్యేకంగా ఉంటాయని, అందుకే పాటలు లేకుండా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
‘జెర్సీ’ (Jersey) సినిమాతో జాతీయ స్థాయిలో ప్రతిభని చాటారు గౌతమ్ తిన్ననూరి. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో (Ram Charan) ఓ సినిమా అనుకున్నారు. సినిమా గురించి చాలా రోజులు చర్చలు జరిగాయి. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా ముందుకెళ్లలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు విజయ్ సినిమా అనౌన్స్ చేశారు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ కోసం ఈ సినిమాను ఇన్నాళ్లూ హోల్ట్‌లో పెట్టాడు విజయ్. ఇప్పుడు పూర్తి చేస్తున్నారు.