చూస్తుంటే.. సావిత్రి బయోపిక్ గా విడుదలైన “మహానటి” రిజల్ట్ ఎఫెక్ట్ బాలకృష్ణ మీద కాస్త ఎక్కువగానే ప్రభావం చూపినట్లుంది. ఒక కథానాయికగా, మంచి వ్యక్తిగా మాత్రమే అందరికీ తెలిసిన మహానటి జీవితాన్నే పెద్దలు, పిల్లలు ఈ స్థాయిలో ఆదరిస్తుంటే.. సాక్ష్యాత్తూ దేవుడిలా కొలిచే ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఇంక ఏ స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తారో అని అంచనా వేసుకొన్న బాలయ్య.. తాను టైటిల్ పాత్ర పోషిస్తూ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మొదలెట్టాడట. ఆల్రెడీ దర్శకుడిగా క్రిష్ ను టీం లోకి తీసుకొచ్చిన బాలయ్య.. ఇప్పుడు “ఎన్టీఆర్” బయోపిక్ ను రెండు భాగాలుగా చిత్రీకరించేందుకు సమాయత్తమవుతున్నాడట.
నందమూరి తారకరామారావు బాల్యం నుంచి సినిమాల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకొన్నంతవరకూ ఒక భాగంగా.. ఆ తర్వాత అగ్ర కథానాయకుడిగా ఎదిగి, అనంతరం రాజకీయ ప్రముఖుడిగా మారి అశేష తెలుగు ప్రజానీకానికి “అన్న”గా రూపాంతరం చెందిన వైనాన్ని రెండో భాగంలో చూపించాలని నిశ్చయించుకొన్నాడట. అందుకే కాస్త లేట్ అయినా పర్లేదు కానీ.. చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా “ఎన్టీఆర్” ఉండాలని కోరాడట క్రిష్ ని. అందుకే క్రిష్ కూడా ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడట.