DRAGON: ఎన్టీఆర్ నీల్.. బీస్ట్ మోడ్‌ మొదలైందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. కానీ ఈ మధ్య ఆయన లుక్స్ మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ముఖ్యంగా ‘దేవర’ తర్వాత తారక్ మరీ సన్నబడటంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. ఆ ముఖంలో ఉండే ‘కళ’ తగ్గిపోయిందని, మన మాస్ హీరో ఇలా మారిపోయాడేంటి అని కొందరు నిరాశ చెందారు. కానీ, ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది.

DRAGON

లేటెస్ట్‌గా బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు కనిపించిన ఆ బక్క పలుచని రూపం మాయమైంది. మళ్ళీ భుజాలు పెంచి, బాడీని ఉక్కులా మార్చి ఒక సాలిడ్ మాస్ కటౌట్‌లా దర్శనమిస్తున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో మళ్ళీ ఇలా బరువు పెరగడం వెనుక ఉన్న అసలు కారణం ‘ప్రశాంత్ నీల్’ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలంటే మామూలుగా ఉండరు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చూస్తేనే అర్థమవుతుంది.. ఆయన హీరోలను ఎంత రగ్గడ్‌గా, భయంకరంగా చూపిస్తారో. ఆ ఇంటెన్సిటీని మ్యాచ్ చేయడానికే ఎన్టీఆర్ ఇప్పుడు బీస్ట్ మోడ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తెరపై తారక్‌ను ఒక విధ్వంసకరమైన లుక్‌లో చూపించడానికి నీల్ స్కెచ్ వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన కోణాల్లో కనిపిస్తారట. ఇప్పటివరకు తీసిన షెడ్యూల్స్ కోసం సన్నగా మారారని, ఇప్పుడు రాబోయే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఇలా బరువు పెరిగారని అంటున్నారు. అంటే ఒకే సినిమాలో మనం రెండు వేరియేషన్స్ చూడబోతున్నామన్నమాట. ఆ సన్నటి లుక్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోయే ఈ మాస్ లుక్ మరో ఎత్తు కానుందట.

నిజానికి ఇలా ఒక సినిమా కోసం వెంటనే బరువు తగ్గడం, మళ్ళీ పెరగడం శరీరానికి అంత మంచిది కాదు. కానీ సినిమా అంటే ఎన్టీఆర్‌కు ఉన్న పిచ్చి అలాంటిది. తాను నమ్మిన కథ కోసం, దర్శకుడి కోసం ఎంత కష్టమైనా పడతారని ఈ మేకోవర్ మరోసారి నిరూపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus