2022లో ఓటీటీలో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” (Odela Railway Station) పెద్ద హిట్టైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా సంపత్ నంది (Sampath Nandi) దగ్గరుండి మరీ తీయించిన చిత్రం “ఓదెల 2” (Odela 2). తమన్నా (Tamannaah Bhatia) కీలకపాత్రలో పోషించిన ఈ చిత్రానికి అశోక్ తేజ (Ashok Teja) దర్శకుడు. టీజర్ & ట్రైలర్ తో సినిమా మీద మంచి అంచనాలను నమోదు చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: ఓదెల గ్రామంలో అమ్మాయిలు మొదటిరాత్రి రోజు మాయమవ్వడానికి, మరణించడానికి తిరుపతి ((Vasishta N. Simha)వశిష్ణ ఎన్.సింహా) కారణం అని తెలుసుకొని, అతడి తల నరికి మరీ జైలుకి వెళ్తుంది రాధ (హెబ్బా పటేల్ (Hebah Patel) ). తిరుపతి మరణం అనంతరం ఊరికి పట్టిన పీడ వదిలిపోతుంది అనుకుంటారు జనాలు.
అయితే.. అప్పటివరకి కామరూపంలో తన కోరికను తీర్చుకున్న తిరుపతి, కొత్తగా ఆత్మ రూపంలో కామానికి పైశాచికత్వం కలగలిపి మరణమృదంగం వాయించడం మొదలెడతాడు. ఆ మారణహోమాన్ని శివశక్తి భైరవి (తమన్నా) ఏ విధంగా ఆపింది? అనేది “ఓదెల 2” (Odela 2) కథాంశం.
నటీనటుల పనితీరు: వశిష్ట ఎన్.సింహా కనబడకపోయినా కేవలం వాయిస్ యాక్టింగ్ తోనే సన్నివేశాలకు ఇంటెన్సిటీ యాడ్ చేశాడు. అయితే.. సదరు సన్నివేశాలు “అరుంధతి”నీ (Arundhati) గుర్తుచేస్తాయి. క్లైమాక్స్ లో అతడి నటన & డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. తమన్నా తనలోని సరికొత్త యాంగిల్ ను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంది. కొంతమేరకు సక్సెస్ అయ్యింది కానీ, ఓవరాల్ గా ఆ పాత్ర ద్వారా డ్రామా సరిగా పండలేదు.
హెబ్బా పటేల్ ఉన్న కొన్ని సన్నివేశాల్లో నవ్వుతుందో, ఏడుస్తుందో అర్థం కాదు. ఊరి ప్రజలుగా, పెద్దలుగా నటించిన వాళ్ళందరూ మాత్రం జీవించేశారు.
సాంకేతికవర్గం పనితీరు: వి.ఎఫ్.ఎక్స్, సీజీఐ, ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ను ముందుగా మెచ్చుకోవాలి. బడ్జెట్ సహకరించిన స్థాయిలో, సినిమాకి అవసరమైనట్లుగా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. సౌందర్ రాజన్ (Soundararajan) సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా హారర్ ఎపిసోడ్స్ కి సింపుల్ గా జంప్ స్కేర్ షాట్స్ తో కాకుండా హీరోయిక్ షాట్స్ తో ఫియర్ ను క్రియేట్ చేసిన విధానం ఆకట్టుకుంది. అలాగే.. అజనీష్ లోక్నాథ్ (B. Ajaneesh Loknath) ట్రాన్స్ ఫార్మాట్ బీజియంకి మేల్ వాయిస్ యాడ్ చేయడం వల్ల, సదరు సన్నివేశాల ఇంపాక్ట్ కొత్తగా ఉంది.
టెక్నికల్ గా ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ సినిమాకి మెయిన్ మైనస్ మాత్రం స్క్రీన్ ప్లే. ఫస్టాఫ్ కాస్తో కూస్తో లాక్కొచ్చాడు అనుకుంటే, సెకండాఫ్ లో కథనం నత్త నడక సాగడమే కాక, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. మరీ ఎక్కువ సన్నివేశాలు రాసుకోవడమే సినిమాకి మైనస్ గా మారింది. ఊరంతా దిబ్ధంగం అయినప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకే ఒక్క పాటలో చూపించేయాలి అనుకోవడం, చిన్న పాపతో ఎలివేషన్ సీన్ లా అనుకుని క్రియేట్ చేసిన తల నరుకుడు సీక్వెన్స్ సరిగా వర్కవుట్ అవ్వకపోవడం..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్ లు ఉన్నాయి. మరి ఈ మైనస్ లకు కేవలం దర్శకుడు మాత్రమే అయినటువంటి అశోక్ తేజ బాధ్యత తీసుకుంటాడా లేక కథ-కథనం-మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ వంటి బాధ్యతలన్నీ భుజాన వేసుకొని, ప్రమోషన్స్ లో సైతం ముందుండి నడిపించిన సంపత్ నంది బాధ్యత వహిస్తాడా అనేది వాళ్ళ ఇష్టం. అయితే.. ఈ ఇద్దరిలో ఎవరిది తప్పు అనేది వదిలేస్తే.. మంచి స్కోప్ ఉన్న కథను, పేలవమైన కథనంతో ఖూనీ చేశారు.
విశ్లేషణ: దెయ్యానికి, దైవత్వానికి మధ్య యుద్ధం అనేది ఎప్పుడో “అమ్మోరు” సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ ఫార్మాట్ లో బోలెడు సినిమాలొచ్చాయి. అయితే.. ఏ ఒక్కదాంట్లోనూ “కామం” అనేది సెంట్రిక్ పాయింట్ అవ్వలేదు. “అరుంధతి”లో ఆ యాంగిల్ ఉన్నప్పటికీ.. దైవత్వాన్ని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేసి ఆడియన్స్ ను ఎంగేజ్ చేశారే తప్ప, ఆ శృంగారం అనే యాంగిల్ తో క్యాష్ చేసుకోవాలనుకోలేదు. “ఓదెల”కి పనికొచ్చింది ఆ యాంగిల్ అయినప్పటికీ.. అందులో ఆ దైవత్వం అనేది కాన్సెప్ట్ లేకపోవడంతో వర్కవుట్ అయ్యింది. కానీ.. “ఓదెల 2” (Odela 2) విషయానికి వచ్చేసరికి ప్రేతాత్మ తమ కామదాహాన్ని రకరకాలుగా తీర్చుకోవడం అనేది కాస్త ఇబ్బందిపెట్టే అంశమైతే, ఆఖరికి శివశక్తిని సైతం కామించడం అనేది నమ్మకాన్ని దెబ్బతీసే పాయింట్. అలాగే.. సాక్ష్యాత్తు ఆ పరమశివుడు తన త్రిశూలాన్ని శివశక్తికి ఇచ్చి మరీ చేయించిన ప్రేతాత్మ హరణాన్ని పార్ట్ 3 లీడ్ కోసం ఎద్దేవా చేయడం అనేది రుచించదు. ఓవరాల్ గా.. “ఓదెల 2” అనేది ఆడియన్స్ ను లాజికల్ కానీ, మ్యాజికల్ గా కానీ ఎంగేజ్ చేయలేక చతికిలపడింది.
ఫోకస్ పాయింట్: కథనాన్ని పెడచెవిన పెట్టిన నంది!
రేటింగ్: 2/5