మలయాళ సీనియర్ హీరో కుంచకో బోబన్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం “ఆఫీసర్ ఆన్ డ్యూటీ” (Officer On Duty). గత నెల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం అనువాద రూపాన్ని నేడు (మార్చి 14) తెలుగులో విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఆకట్టుకుంది, మరి తెలుగు వెర్షన్ ఎలా ఉంది? ఇక్కడ ఆడియన్స్ ను ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
కథ: హరి శంకర్ (కుంచకో బోబన్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక బంగారు గొలుసు కేస్ ను డీల్ చేస్తుండగా.. ఊహించని విధంగా ఓ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య కేస్ మరియు తన పెద్ద కూతురు సూసైడ్ కేస్ కనెక్ట్ అవుతాయి. ఆ బంగారు చైన్ కి ఈ రెండు కేసులకి కనెక్షన్ ఏంటి? అనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన హరి శంకర్ కు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అసలు ఈ ఆత్మహత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ బంగారు గొలుసును లాగితే డొంక ఎలా కదిలింది? అనేది “ఆఫీసర్ ఆన్ డ్యూటీ” (Officer On Duty) కథాంశం.
నటీనటుల పనితీరు: ఈ తరహా సీరియస్ పాత్రలు పోషించడం అనేది కుంచకో బోబన్ కి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ తో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడం, క్యారెక్టర్ తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయడంలో కుంచకో స్టైల్ బాగుంటుంది. ఇక ఈ సినిమాలో పోలీస్ బాధ్యతకు తండ్రి ఎమోషన్ కూడా తోడవ్వడం అనేది హరి శంకర్ అనే క్యారెక్టర్ వర్కవుట్ అవ్వడంలో కీరోల్ ప్లే చేసింది.
ఓ సగటు ఇండిపెండెంట్ హౌస్ వైఫ్ గా ప్రియమణి ఒదిగిపోయింది. జగదీష్ కీలకపాత్రలో మెప్పించారు. విశాక్ నాయర్, లేయా మమ్మెన్, ఐశ్వర్య రాజ్ లు జెన్ జీ విలనిజాన్ని పండించడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ల క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేసారు.
సాంకేతికవర్గం పనితీరు: జేక్స్ బిజోయ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ మంచి కిక్ ఇచ్చింది. విలనిజాన్ని, హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అయితే.. తెలుగు సాహిత్యం సరిగా లేక పాటలేవీ పొసగలేదు. ఇక డైలాగ్స్ & డబ్బింగ్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలే డైలాగ్స్ లో తెలుగు భాష సరిగా లేదు అనుకుంటే.. ఒక్కరికి కూడా డబ్బింగ్ వాయిస్ లు సెట్ అవ్వకపోవడం మరో పెద్ద మైనస్. ఇలాంటి క్వాలిటీతో ఇంత కంగారుగా రిలీజ్ చేయడం ఎందుకు అనేది డిస్ట్రిబ్యూటర్స్ కే తెలియాలి. ఇక తెలుగు టైటిల్ కార్డ్స్ లో దొర్లిన తప్పులు హేయంగా ఉన్నాయి. ఆఖరికి కొన్ని చోట్ల పొరపాటున “CTRL+V” కొట్టినప్పుడు వచ్చే “V” అనే ఆంగ్ల పదాన్ని కనీసం డిలీట్ కూడా చేయకుండా వదిలేయడం అనేది తెలుగు రిలీజ్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారు అనేదానికి ఉదాహరణ.
సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం బాగుంది. ముఖ్యంగా లైటింగ్ & ఫ్రేమ్ వర్క్ మంచి థ్రిల్లర్ ఫీల్ తీసుకొచ్చాయి. అలాగే.. ఎడిటింగ్ & డి.ఐ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. దర్శకుడు జీతూ అష్రఫ్ కథనాన్ని అల్లిన విధానం బాగుంది. ఒక థ్రిల్లర్ కు కావాల్సిన అంశాలన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ.. ప్రెడిక్టబుల్ గా ఉండడం అనేది చిన్నపాటి మైనస్. ఆ ప్రెడిక్టబిలిటీని ఇగ్నోర్ చేయగలిగితే.. ఆఫీసర్ మంచి టైమ్ పాస్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు.
విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్లు, డ్రామాలకు మలయాళం ఇండస్ట్రీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గతేడాది కానీ, ఈ ఏడాది కానీ పదుల సంఖ్యలో థ్రిల్లర్లు వచ్చాయి. అయితే.. అన్నీ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించలేకపోయాయి. కొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి. “ఆఫీసర్ ఆన్ డ్యూటీ” ఈ రెండో రకం సినిమా. అయితే.. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ అనేది సినిమాకి మైనస్ గా మారింది. అయినప్పటికీ.. థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ హ్యాపీగా ఒకసారి ట్రై చేయవచ్చు!
ఫోకస్ పాయింట్: ప్రెడిక్టబుల్ బట్ ఎంగేజింగ్ థ్రిల్లర్!
రేటింగ్: 2.5/5