టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్ తరువాత ఆ రేంజ్ లో ఆడియన్స్ ను నవ్వించి కామెడీ హీరోగా సత్తా చాటాడు అల్లరి నరేష్. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు కావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఈజీగానే వచ్చింది. కానీ తన టాలెంట్ తో నటుడిగా ఎదిగాడు. చిన్న వయసులోనే యాభైకి పైగా సినిమాల్లో నటించారు. ఏడాదికి మూడునాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ బిజీగా ఉండేవాడు. ఆ తరువాత స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో చేసిన పొరపాట్ల వలన వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి.
దీంతో డీలా పడ్డాడు. కొంతకాలం గ్యాప్ ఇచ్చి కామెడీ సినిమాలను పక్కన పెట్టేసి.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ముందుగా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ లో కనిపించారు. ఈ సినిమా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. అలానే ‘నాంది’ అనే సినిమాలో నటించారు అల్లరి నరేష్. ఈ సినిమాలో అతడి పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా అతడికి భారీ విజయాన్ని తీసుకొచ్చింది.
ఈ సినిమాల సక్సెస్ తో అల్లరి నరేష్ కెరీర్ కి బూస్టప్ వచ్చింది. గతేడాది ‘సభకు నమస్కారం’ అనే మరో సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే మరో సినిమా అంగీకరించినట్లు సమాచారం. రాజా మోహన్ అనే కొత్త దర్శకుడు ఇటీవల నరేష్ ని కలిసి కథ వినిపించారట. స్టోరీ కొత్తగా ఉండడంతో నరేష్ కూడా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇంకా నిర్మాత ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.