ఏడాది క్రితం లాక్‌డౌన్ విధించినప్పుడు చాలా సినిమాల విడుదల ఆగిపోయింది. చాలా సినిమాలు ఓటీటీ తలుపు తట్టాయి. కొన్ని మాత్రం అలానే ఉండిపోయాయి. తర్వాత కొన్ని నెలలకు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు కానీ 50 శాతమే ఆక్యుపెన్సీ అనేసరికి కొన్ని సినిమాలు విడుదల చేశారు. మొత్తం 100 శాతం మందినీ అలౌ చేయొచ్చు అనేసరికి ఒక్కో సినిమా విడుదల చేసుకుంటూ వస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో మళ్ల పరిస్థితి మారింది. అక్కడ థియేటర్లకు ప్రభుత్వం నో చెప్పింది. దీంతో సినిమాల విడుదల అగమ్యగోచరంగా మారింది. దీంతో చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి.
బాలీవుడ్‌లో వాయిదా పడుతున్న సినిమాల్లో ‘సూర్యవంశీ’ ఒకటి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రోహిత్ శెట్టి తెరకెక్కించిన సినిమా ఇది. అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. గతేడాది సమ్మర్‌లో రావాల్సిన సినిమా ఇది. లాక్‌డౌన్ వల్ల ఆగిన సినిమాను ఈ సమ్మర్‌లో విడుదల చేద్దాం అనుకున్నారు. ఏప్రిల్ 30 డేట్ కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా వాయిదా వేశారు. కొత్త తేదీ చెప్పలేదు. లాక్‌డౌన్ పరిస్థితులు అయ్యాకే చెబుతారు.
బాలీవుడ్‌లో చాలా సినిమాలు ఓటీటీవైపు వెళ్లినా… ‘సూర్యవంశీ’ని మాత్రం ఓటీటీకి ఇవ్వలేదు. మామూలుగా సినిమా అంటే బడ్జెట్, వడ్డీలు ఇవన్నీ ఉంటాయి. మరి అక్షయ్ సినిమా‘సూర్యవంశీ’ వాటన్నిటినీ ఎలా తట్టుకుంటుందో మరి. అదే తెలుగు సినిమా అయితే ఓటీటీకి ఇచ్చేసేవారేమో. సినిమా మీద ఎంత నమ్మకం ఉండకపోతే దర్శకనిర్మాతలు ఇన్నాళ్లు ఆగారు… ఇంకా ఆగుతారు.