ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ అయిన శ్రావణ భార్గవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు తన భర్తతో ఈమె విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తల పై ఆమె స్పందించి అది అబద్ధం అన్నట్టు తేల్చి చెప్పేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో అన్నమయ్య రాసిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను పాడింది శ్రావణ భార్గవి. ఆ పాటలో ఆమె శృంగారభరితంగా మార్చారంటూ అన్నమయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీవారిని అన్నమయ్య స్మరిస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగి తేలిన అనుభూతి కలిగేలా ఉన్న ఆ కీర్తనని ఆమె అపహాస్యం చేసిందని మండిపడ్డారు. తన అందాన్ని పొగుడుకోవడానికి ఆ పాటను వాడుకుంది అంటూ విమర్శలు గుప్పించారు. వెంటనే ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే తాను పాడిన పాటలో అశ్లీలత ఎక్కడ ఉంది అంటూ ఆమె తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. అయితే తిరుపతి వాసులు మాత్రం శ్రావణ భార్గవి ని తిరుపతిలో అడుగుపెట్టనివ్వం అంటూ హెచ్చరిస్తున్నారు.
తిరుమల దర్శనానికి ఆమె కనుక వస్తే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.అంతేకాదు అన్నమయ్య కుటుంబానికి కూడా ఆమె క్షమాపణ చెప్పాలని.. డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వివాదంపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని..వారు కూడా శ్రావణ భార్గవి వ్యవహార శైలిపై స్పందించాలని కోరుతున్నారు.
అన్నమయ్య కీర్తనలు ఇక పై ఎవ్వరూ అవమానించకుండా ఓ చట్టాన్ని తీసుకురావాని వారు ఘాటుగా స్పందించారు. అంతేకాదు శ్రావణి భార్గవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సీఐకు కంప్లైంట్ కూడా ఇచ్చారు.