దేవుడు సినిమాలు తీయడం చాలా కష్టం. అంటే.. సినిమాలు తీసే ప్రాసెస్ గురించి కాదు మేం చెప్పేది. సినిమా తీసే క్రమంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే ఆ పరిస్థితిని అదుపులోకి తేవడం చాలా కష్టం. గతంలో చాలామంది సినిమా జనాలు ఈ పరిస్థితిని చూసి వచ్చినవారే. సినిమాలో పాత్రల లుక్స్, మాట తీరు, సినిమా తీర్చిదిద్దిన విధానం.. ఇలా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు పడతారు. ఈ విషయంలో బాలీవుడ్ దర్శకులకు అనుభవం కూడా ఉంది.
ఇంత అనుభవం ఉన్నా.. ఓ బాలీవుడ్ దర్శకుడు ప్రేక్షకుల్ని ఇబ్బందిపెడుతూ, నెటిజన్లకు అవకాశమిస్తూ.. ఆయనా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఇలాగే ఇబ్బందిపడి.. సినిమా వాయిదా వేసుకున్న ఆ దర్శకుడు ఇప్పుడు మరోసారి వచ్చి మళ్లీ ఇబ్బందిపడుతున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా ఇటీవల ‘ఆదిపురుష్’ కొత్త పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఆ పోస్టర్ చూడటానికి ఆసక్తికరంగా ఉన్నా.. లేని పోని చర్చలకు దారితీసేలా ఉంది.
నిజానికి ‘ఆదిపురుష్’ విషయంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడే విమర్శలు చెలరేగాయి. హనుమంతుడి దుస్తులు, రావణాసురుడి వాహనం, రాముడి లుక్.. ఇలా చాలా విషయాల్లో నేచురాలిటీ లేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత అవి ట్రోలింగ్, వార్నింగ్ గా మారిపోయాయి. ఇప్పుడు కొత్త పోస్టర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. కొత్త పోస్టర్‌ను రామాయణ ఘట్టానికి చెందిన ఐకానిక్ లుక్‌తో తీర్చిదిద్దారు. అయితే అక్కడే ఇబ్బందిపెట్టారు. రామాయణం అనగానే రాముడు – సీత – లక్ష్మణుడి గెటప్పులు గుర్తొస్తాయి.
ఇప్పుడు ఈ పోస్టర్‌లో (Adipurush) ఆ గెటప్పులే ఇబ్బందిగా ఉన్నాయి. సాత్వికంగా ఉండాల్సిన లుక్‌లు ఏదో పోరాట యోధుల సినిమాలో లుక్స్‌లాగా తీర్చిదిద్దారు. పుస్తకాల్లో, పాత సినిమాల్లో చూపించిన లుక్ కాకుండా.. కొత్తగా చూపించారు. రాముడికి తలపై కిరీటం లేకుండా పోస్టర్ సిద్ధం చేశారు. అలాగే బాడీసూట్ లాంటిది కూడా పెట్టారు. సీత లుక్‌లో ఓ శాలువ లాంటిది కప్పడం విమర్శలకు తావిస్తోంది. లక్ష్మణుడి పాత్రలో భక్తి భావం కాకుండా, వీరత్వం కనిపిస్తోంది అంటున్నారు. దుస్తుల విషయం సరేసరి. దీంతో పోస్టర్‌లో చర్చ రేగి, రచ్చ అవుతోంది.