రీమేక్ కోసం కథ వెతుక్కోవడం సులభమే… కానీ ఆ కథను సరిగ్గా తెరకెక్కించి, మాతృకలోని ఫీల్‌ను బ్యాలెన్స్ చేస్తూ తీస్తేనే విజయం సాధిస్తుంది. ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. అయితే ఈ విషయంలో చాలా రీమేక్‌లు సఫలం కాలేవు. అలాంటి వాటికి రీసెంట్ ఉదాహరణ ‘రెడ్’. రామ్ చేసిన ఈ సినిమా మాతృక ‘తడమ్’కి ఏ మాత్రం బ్యాలెన్స్ చేయలేదని విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో హీరో ఆ సినిమా చేస్తున్నాడు.
ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల్ని గబుక్కున ఎగరేసుకుపోతున్న బాలీవుడ్… మరోసారి సౌత్ సినిమా మీద కన్నేసింది. అదే అరుణ్ విజయ్ తమిళ సూపర్ హిట్ సినిమా ‘తడమ్’. ఈ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా ఈ సినిమాను వర్ధన్ ఖేత్కర్ రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా స్టార్ట్ చేస్తున్నారట.
బాలీవుడ్ మన సినిమాలు చేయడం కొత్త కాకపోవచ్చు. కానీ అలా తీసుకెళ్లిన సినిమాలు విజయాలు సాధించడం మాని… విమర్శల పాలవుతుండటం గమనార్హం. ఇప్పుడు ‘తడమ్’ రీమేక్ దగ్గరకి వచ్చేసరికి… తెలుగులోనే సరైన విజయం సాధించని సినిమాను హిందీలోకి తీసుకెళ్లి ఏం చేస్తారనేదే ప్రశ్న. మరోవైపు ఆదిత్య రాయ్ కపూర్ నటన అంతంతమాత్రం అని బాలీవుడ్‌లో పెద్ద పేరు. మరి అతను ‘తడమ్’ ఫీల్‌ను తీసుకొస్తాడా? అనేది చూడాలి.