ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 18, 2019 / 07:10 PM IST

“వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత” లాంటి సెన్సిబుల్ మూవీస్ తో దర్శకుడిగా పేరు సంపాదించుకొన్న సాయికిరణ్ అడివి తన పంధాను మార్చుకొని తెరకెక్కించిన యాక్షన్ మిస్టరీ “ఆపరేషన్ గోల్డ్ ఫిష్”. ఆది సాయికుమార్ హీరోగా.. “ఎయిర్ టెల్” ఫేమ్ శషా చెట్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఎప్పుడో పూర్తైనప్పటికీ.. కారణాంతరాల వలన పలుమార్లు వాయిదా అనంతరం నేడు (అక్టోబర్ 18) విడుదలయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: అర్జున్ పండిట్ (ఆది సాయికుమార్) ఒక సిన్సియర్ సోల్జర్. అతికష్టం మీద ప్రాణాలు పణంగా పెట్టి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఝాజీ బాబా (అబ్బూరి రవి)ని పట్టుకొంటాడు. అదే ఘాజీ బాబాను విడిపించడం కోసం మరో టెర్రరిస్ట్ ఫరూక్ (మనోజ్ నందం) ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ మినిష్టర్ ఏ.కె.శర్మ (రావు రమేష్) కూతురు నిత్య (నిత్య నరేష్)ను కిడ్నాప్ చేయాలి అనుకొంటారు.

ఈ డ్రమటిక్ మిస్టరీ యాక్షన్ ఎపిసోడ్ లో చివరకు ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది “ఆపరేషన్ గోల్డ్ ఫిష్” కథాంశం.

నటీనటుల పనితీరు: “శమంతకమణి” తర్వాత ఆదిలోని నటుడ్ని కాస్త బెటర్ గా వాడుకున్న చిత్రం “ఆపరేషన్ గోల్డ్ ఫిష్”. కాకపొతే.. ఆర్మీ ఆఫీసర్ వ్యవహారశైలి విషయంలో దర్శకుడు సరిగా హోమ్ వర్క్ చేయలేదు అనిపిస్తుంది. నిజానికి ఆర్మీ నేపధ్యంలో సినిమా అంటే చాలా డీటెయిలింగ్ అవసరం. ఆ డీటెయిలింగ్ కానీ, క్యారెక్టర్ ఆర్క్ కానీ ఈ సినిమాలో ఆది పాత్రకు మాత్రమే కాదు.. ఏ ఒక్క పాత్రలోనూ కనిపించదు. భీభత్సమైన హైప్ ఇచ్చిన శషా చెత్రీ క్యారెక్టర్ అయితే మరీ ఫ్రెండ్ రోల్ లా ఉంటుంది. నూకరాజు కామెడీ టైమింగ్ ను కూడా దర్శకుడు సరిగా వినియోగించుకోలేకపోయాడు. అబ్బూరి రవి ఘాజీ బాబా పాత్రలో విలనిజం పండించడానికి ప్రయత్నించారు కానీ.. ఆయన వాచకం అందుకు సహకరించలేదు. రావు రమేష్ ఎప్పట్లానే తన పాత్రలో జీవించారు.

సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్‌, సతీష్ డేగల, మిగతా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు అందరూ నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా నిర్మాణంలో అందరూ భాగస్వాములే అన్నమాట. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఎందుకో మొదటిసారి గాడి తప్పినట్లుగా అనిపిస్తుంది. శ్రీచరణ్ నేపధ్య సంగీతంలో దమ్ము ఉన్నప్పటికీ.. సన్నివేశాల్లో ఇంటెన్సిటీ లేకపోవడం వలన శ్రీచరణ్ పనితనం బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా సోసోగా ఉన్నాయి.

అన్నిటికీ మించి స్క్రీన్ ప్లే & స్టోరీ లైన్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉండడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. దర్శకుడు సాయికిరణ్ అడివికి ఈ జోనర్ లో పట్టు లేదన్న విషయం మొదటి పది నిమిషాల్లోనే అర్ధమైపోతుంది. ఇక చివరి వరకు సినిమాను సాగదీసిన విధానం మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. మనోజ్ నందన్ నటన బాగున్నా.. అతడి వాచకం, నొక్కి పలికే కొన్ని మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు మరీ స్పూఫ్ లా ఉండడం గమనార్హం. అన్నిటికీ మించి ఈ సినిమా మూల కథ షారుక్ ఖాన్ నటించిన “మై హూ నా” చిత్రాన్ని తలపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

విశ్లేషణ: “బుర్రకథ, జోడీ” లాంటి డిజాస్టర్స్ అనంతరం వచ్చిన “ఆపరేషన్ గోల్డ్ ఫిష్” ఆది కెరీర్ కు ఏమాత్రం ప్లస్ అవ్వలేకపోయింది. అయితే.. “బుర్రకథ” తరహాలో మైనస్ గా మాత్రం నిలవకపోవడం కాస్త ఉపసమనం కలిగించే విషయం. ఈ తరహా నేపధ్యంలో సినిమాలు తీయాలంటే నటీనటుల మీద కంటే కథనం, కాన్సవాస్ మీద వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుందనే విషయం.. దర్శకుడికి ఈపాటికే అర్ధమై ఉంటుంది.

రేటింగ్: 1/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus