ఓటీటీలు అంటే సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని రోజులు సినిమాలు చూసే వేదికలుగా ఉండేవి. అప్పడప్పుడు సిరీస్‌లు వస్తుండేవి. అయితే ఇదంతా కరోనా ఫస్ట్ వేవ్ ముందు వరకే. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. థియేటర్‌లో విడుదల కాని చాలా సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఓటీటీ వాడకం బాగానే పెరిగిందని చెప్పుకోవాలి. అయితే ఫస్ట్ వేవ్‌లో చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీకి వచ్చాయి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేసింది. ఇప్పుడు నిర్మాతలేం చేస్తారో? ఇప్పుడిదే ప్రశ్న టాలీవుడ్‌లో రెగ్యులర్‌గా వినిపిస్తోంది.
కరోనా ఫస్ట్ వేవ్ పరిస్థితులు సద్దుమణిగాక చాలా సినిమాలు చిత్రీకరణలు పూర్తి చేసుకున్నాయి. ఇక రిలీజ్ అని అనుకునేసరికి కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. దీంతో ఆ సినిమాల విడుదల వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తాయి అని అంటున్నారు. అయితే ఓ నెలలో కరోనా పరిస్థితులు సెట్ అయిపోతాయని కొంతమంది వాదన. దీంతో నిర్మాతలు ఓ నెల వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నారట. అప్పటికీ సెట్ కాకపోతే ఓటీటీ డీల్స్ షురూ అవుతాయి.
ఒకవేళ ఓటీటీ డేస్ మొదలైతే… తెలుగులో విడుదల అవ్వడానికి చాలా సినిమాలున్నాయి. ‘లవ్‌స్టోరీ’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’, ‘ఇష్క్’, ‘ఏక్ మినీ కథ’ లాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘నారప్ప’, ‘దృశ్యం 2’, ‘సీటీమార్’ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇక ‘కొండపొలం’, ‘తిమ్మరసు’ కూడా సిద్ధంగా ఉన్నాయంటున్నారు. వీటితోపాటు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా రెడీగానే ఉన్నాయి. వీటిలో ఎన్ని ఓటీటీవైపు వస్తాయో చూడాలి. వీటిలో ఈ సారి పెద్ద సినిమాలు కచ్చితంగా ఓటీటీకి వస్తాయని టాక్.